mt_logo

దావతే ఇఫ్తార్ లో పాల్గొన్న సీఎం కేసీఆర్..

పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఆదివారం రాత్రి నిజాం కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దావతే ఇఫ్తార్ కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. అనంతరం సీఎం ముస్లిం సోదరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్ర ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో వర్ధిల్లిన ఒకనాటి గంగాజమునా తహెజీబ్ సంప్రదాయాన్ని తిరిగి తీసుకొద్దామని చెప్పారు. ప్రజలందరి సహకారం, అల్లాహ్ దయతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని అభివృద్ధిలో పురోగమిస్తున్నామని, రాష్ట్రాభివృద్ధికి అందరూ సహకరించాలని ఈ భూమి తల్లి బిడ్డగా, మీ కొడుకుగా విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు.

ఇప్పటిదాకా తాము ప్రజలకు చేసింది తక్కువేనని, చేయాల్సింది ముందుముందు ఇంకా చాలా ఉందన్నారు. కొందరు మన చెడును కోరుకుంటున్నారు.. అయినాసరే భగవంతుడి అనుగ్రహం ప్రకారమే ఏదైనా జరుగుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. 1927లో జాతిపిత మహాత్మాగాంధీ హైదరాబాద్ సందర్శించిన సందర్భంగా వివేకవర్ధిని కాలేజీలో ప్రసంగిస్తూ ఇక్కడి రాజులు, సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో బాగున్నాయని కీర్తించారని గుర్తుచేశారు. సమాజంలో ఒకరికొకరు కలిసిమెలిసి సమైక్య భావాలతో మెలగడంలో ప్రపంచంలో తెలంగాణకు మించిన ప్రదేశం మరొకటి లేదని గాంధీ ప్రశంసించారని చెప్పారు. ఇప్పుడు మన రాష్ట్రం వచ్చింది.. ఎన్నికల ముందు చేసిన వాగ్ధానం ప్రకారం గంగా-జమునా తహెజీబ్ ను తిరిగి తీసుకొస్తామని సీఎం అన్నారు. ఈ సారి లక్షా 95వేల మంది నిరుపేదలకు బట్టలు పంపిణీ చేస్తున్నామని, రాష్ట్రంలోని 195 మసీదుల్లో ఆదివారం ప్రభుత్వం తరపున దావతే ఇఫ్తార్ ను ఏర్పాటు చేశామని చెప్పారు.

నిజాం కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కే స్వామిగౌడ్, ఎంపీలు కే కేశవరావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు, టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, పలువురు ముస్లిం మతపెద్దలు, ఇరాన్, టర్కీ కాన్సులేట్ జనరల్స్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సీవీ ఆనంద్ తదితరులు హాజరయ్యారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *