mt_logo

యాదగిరీశుని శోభాయాత్రలో పాల్గొన్న సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో సోమవారం ఉదయం సంప్రోక్షణ ఉత్సవాలు మొద‌ల‌య్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వ‌హించిన శోభాయాత్ర‌లో సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్ర‌భుత్వ అధికారులు, అర్చ‌కులు, వేద పండితులు పాల్గొన్నారు. శోభాయాత్ర‌లో భాగంగా బంగారు క‌వ‌మూర్తులు, ఉత్స‌వ విగ్ర‌హాలు, అళ్వార్లు ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణాలు, మేళ‌తాళాల మ‌ధ్య శోభాయాత్ర వైభ‌వంగా కొన‌సాగుతోంది. ఆల‌యం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు. ప్రధానాలయ పంచతల రాజగోపుర‌రం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు సంప్రోక్షణ చేస్తారు. దివ్య విమానంపై శ్రీసుదర్శన స్వర్ణ చక్రానికి, ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులు సంప్రోక్షణ నిర్వహిస్తారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రధానాలయంలోకి శోభాయాత్రగా వెళ్లి పంచనారసింహుడికి ఆరాధనలు జరుపుతారు. అనంతరం స్వయంభువుల దర్శనాలకు అనుమతి ఇస్తారు. బాలాలయంలో 2016 ఏప్రిల్‌ 21 నుంచి ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు కొనసాగుతుండగా, ఆదివారం రాత్రి నుంచే బాలాలయంలో దర్శనాలకు తెరపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *