mt_logo

తెలంగాణలో 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ స్లేబ్యాక్

పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశాలు సఫలం అవుతున్నాయి. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణకు ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికే అనేక సంస్థలు తెలంగాణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ కార్యకలాపాలు ప్రారంభించగా… ఆదివారం జరిగిన సమావేశాల్లో మరిన్ని అమెరికా దిగ్గజ కంపెనీలు పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించాయి. న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్‌ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. వచ్చే మూడేండ్లలో 20 మిలియన్‌ డాలర్లు (రూ.1,500 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపింది. సీజీఎంపీ (CGMP) ల్యాబ్‌తోపాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నది. గత ఐదేండ్లలో హైదరాబాద్‌లో స్లేబ్యాక్‌ సుమారు రూ. 2,300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మంత్రి కేటీఆర్‌తో సమావేశం తరువాత స్లేబ్యాక్‌ ఫార్మా వ్యవస్థాపకుడు, సీఈవో అజయ్‌ సింగ్‌ ఈ భారీ పెట్టుబడి ప్రకటన చేశారు. అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి జెనరిక్‌ ఔషధాల తయారీ అనుమతులు పొందడానికి అవసరమైన క్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ఘనత తమ కంపెనీదని వెల్లడించారు. హైడ్రాక్సీప్రోజెస్టెరాన్‌ 5 ఎంఎల్‌ జెనరిక్‌ ఔషధాన్ని అమెరికన్‌ మారెట్‌లో తొలిసారి ప్రవేశపెట్టింది తామేనని పేర్కొన్నారు. ఈ కంపెనీ 35 మంది సిబ్బందితో 2017లో హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం 3 యూనిట్లలో 106 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *