ఎనిమిదేండ్ల క్రితం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో, చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో జరుగుతున్న న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర న్యాయ పరిపాలన విభాగం ఇంకా ముందుకెళ్లాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యుత్ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నామన్నారు. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అని చెప్పారు.
హైదరాబాద్ పట్ల జస్టిస్ ఎన్వీ రమణకు చాలా ప్రేమ ఉందని, సుదీర్ఘకాలం హైదరాబాద్‌లో పనిచేసి అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకున్నారన్నారు. హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. అయితే సీజేఐ రమణ చొరవతో హైకోర్టు బెంచీలను 24 నుంచి 42కు పెంచారన్నారు.
న్యాయ వ్యవస్థలో గతంలో 780 పోస్టులు మంజూరు చేశామని, ఇపుడు మరో 885 అదనపు పోస్టులు కూడా హైకోర్టుకు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులకు అదనంగా 1730 పోస్టులు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులలో పనిభారం ఉందని తెలిసిందన్నారు. జిల్లా కోర్టుల్లో జడ్జిలు, మెజిస్ట్రేట్ సిబ్బందిని నియమిస్తే పనిభారం తగ్గుతుందని చెప్పారు. 23 జిల్లాల్లో జిల్లా కోర్టు భవనాలు చేపడతామని, వాటికోసం స్థల సేకరణ జరుగుతున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోటి 52 లక్షల ఎకరాల భూములను డిజిటలైజ్ చేశామన్నారు. రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. న్యాయమూర్తులు హోదాకు తగ్గట్లుగా 42 మంది జడ్జిలకు 30 ఎకరాల్లో క్వార్టర్స్ నిర్మిస్తామని, సీజేఐ రమణతో శంకుస్థాపన చేయిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడంలో పోటీ నెలకొందని సీఎం కేసీఆర్ అన్నారు. పారిశ్రామికవేత్తలు న్యాయవ్యవస్థ గురించే అడుగుతారని చెప్పారు. సమస్యలు వెంటనే పరిష్కరిస్తే మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.