mt_logo

దళితులను కోటీశ్వరులనే చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం : మంత్రి కేటీఆర్

అత్యంత వెనుకబడ్డ దళితజాతి ఉద్ధరణ కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధును తీసుకొచ్చారు. వారు వృద్ధిలోకి రావటానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైనంతగా రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 131వ జయంతి సందర్భంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాలను ఆవిష్కరించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సిరిసిల్లలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బైపాస్‌ రోడ్డులో నూతనంగా నిర్మించిన అంబేద్కర్‌ భవనాన్ని ప్రారంభించి, దళితబంధు లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు. అదే హాలులో 119 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి వారినుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో 75 ఏండ్లలో జరుగని ఎన్నో విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలు ఏడేండ్లలోనే చేపట్టి, తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. ఎంతోమంది రాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, సామంతులు, పార్టీలు అధికారం చెలాయించినా.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన అద్భుతమైన పథకాలను కేంద్రంలో కానీ.. ఏ రాష్ట్రం కానీ ప్రవేశపెట్టనే లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక రిఫార్మర్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ అని కొనియాడారు. దళితబంధు పథకం కేసీఆర్‌ కాబట్టే ప్రవేశపెట్టగలిగారని చెప్పారు. రూపాయి పెట్టుబడి పెడితే రూపాయిన్నర వచ్చేలా కృషిచేయాలని లబ్ధిదారులకు సూచించారు.

దేశంలో దళితబిడ్డలందరికీ దిక్సూచి :

దళితబంధుకోసం బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రే ఇంత చేసినప్పుడు.. అంతర్జాతీయ నాయకుడైన మోదీ దేశంలోని పేదలకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి బాట పడుతుంటే కేంద్రం అడ్డుపడుతున్నదని మండిపడ్డారు. దళిత బంధు పథకం విజయవంతమై దేశంలోని కోట్లాది మంది దళిత బిడ్డలకు దిక్సూచి కావాలని ఆకాంక్షించారు. సర్కారు ఇచ్చిన రూ.10 లక్షలతో వ్యాపారాలు పెట్టుకొని సత్తా చాటాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లనే స్వరాష్ట్రం సాకారమైందని ఉద్ఘాటించారు. ఇప్పుడా రాజ్యాంగం మోదీ చేతుల్లోకి పోయిందని, కేంద్ర నిరంకుశ పాలనపై అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

లబ్ధిదారులకు దళిత రక్షణ నిధి :

దళితబంధు లబ్ధిదారులందరికీ ‘దళిత రక్షణ నిధి’ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. ప్రతి లబ్ధిదారుడికీ రూ.9.90 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. మిగిలిన రూ.10వేలు ‘దళిత రక్షణ నిధి’ కింద జమచేస్తామని, వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయిన దళిత బిడ్డలను ఆదుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. దళితబంధు ఇస్తే ఉపయోగం ఏమిటంటూ ప్రశ్నించే వాళ్ల మూతి మీద తన్నేట్లు ఈ పథకాన్ని విజయవంతంచేసి చూపించాలని లబ్ధిదారులకు సూచించారు. పెట్టుబడి మీదైతే.. అందుకు సహకారం మాది అని.. రూపాయి పెట్టుబడికి రూపాయిన్నర వచ్చేలా కృషిచేయాలని హితవుచెప్పారు. మత గజ్జి, కుల పిచ్చితో దేశంలో అభివృద్ధి కుంటు పడిందని కేటీఆర్‌ విమర్శించారు. సమాజంలో రెండే కులాలు ఉన్నాయనీ, ఒకటి ఉన్నోళ్లు, రెండోది లేనోళ్లని తెలిపారు. దేవుడు సృష్టించిన మనుషులమే కులం, మతం అంటూ పంచాయితీలు, ఘర్షణలు పెట్టుకుంటూ దిగజారి పోతున్నామంటూ విచారం వ్యక్తం చేశారు. తెలివి ఎవడబ్బ సొత్తూ కాదని హితవు చెప్పారు. తమకున్న తెలివిని ఉపయోగించుకుంటూ సమానత్వంతో అందరూ కలిసి ఉండేలా భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా నిలువాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *