హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆస్పత్రుల్లో 21 సీటీ స్కాన్ కేంద్రాలను మంజూరు చేశామని, అందులో మొదటి సీటీ స్కాన్ కేంద్రాన్ని గాంధీలో ప్రారంభించామని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ముఖ్యమంగా గుండె జబ్బుకు సంబంధించిన క్యాథ్ ల్యాబ్ కూడా అవసరం ఉంది. కొత్త క్యాథ్ ల్యాబ్‌ను 6.5 కోట్లతో, ఎంఆర్ఐ మిషన్‌ను 12.5 కోట్లతో మంజూరు చేశామని, వీటిని వచ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
వైద్యులపై ప్రశంసలు:
గాంధీ ఆస్పత్రిలో వైద్యులు అద్భుతమైన కొవిడ్ సేవలు అందించారని, దాదాపు 84,187 మంది కొవిడ్ బాధితులకు నిర్విరామ వైద్యం చేసారని మంత్రి కొనియాడారు. కొవిడ్ చికిత్స విషయంలో ప్రయివేటు ఆస్పత్రులు చేతులు ఎత్తేస్తే.. వారికి గాంధీలో పునర్జన్మ కల్పించిన ఘనత గాంధీ ఆస్పత్రి సిబ్బందికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గాంధీ ఆస్పత్రికి 176 కోట్ల మంజూరు చేశాం. ఇప్పటి వరకు 100 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. గాంధీలో అత్యాధునికమైన పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గాంధీ ఆవరణలో 200 పడకల ఎంసీహెచ్ ఆస్పత్రి పనులు నాలుగైదు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే ఉస్మానియా ఆస్పత్రిలో మరో మూడు రోజుల్లో క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించి, రోగులుకు హార్ట్ సర్జరీలు చేస్తామని హరీశ్‌రావు తెలిపారు.