జూన్ 12న తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోయే టీఎస్ఐపాస్ కార్యక్రమానికి రావాల్సిందిగా టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీని రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. బుధవారం రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ లతో కలిసి మంత్రి కేటీఆర్ ముంబైలో సైరస్ మిస్త్రీతో సమావేశమై టీఎస్ఐపాస్ కు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. టీహబ్, టాస్క్ వంటి కార్యక్రమాల్లో టాటా గ్రూప్ భాగస్వామ్యం కావాలని, తాము ఏర్పాటు చేయబోయే టీహబ్ ఇన్నోవేషన్ ఫండ్ లో టాటా గ్రూప్ నుండి భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. దీనిపై స్పందించిన సైరస్ మిస్త్రీ మాట్లాడుతూ, టాటా అధినేతల హృదయంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే నూతన ప్రాజెక్టులను తెలంగాణలో ప్రారంభించేందుకు సైరస్ మిస్త్రీ ఆసక్తి కనపరచారు. అంతేకాకుండా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వ్యవస్థాపకులు ఎఫ్ సీ కోహ్లీ స్మారకార్థం హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో నూతన బ్లాకును నిర్మిస్తామని కూడా సైరస్ మిస్త్రీ హామీ ఇచ్చారు.