mt_logo

చనాక-కొరాట బ్యారేజికి కేంద్ర జల మంత్రిత్వ శాఖ తుది అనుమతులు… త్వరలోనే ట్రయల్స్ 

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గల పెన్‌గంగపై జైనథ్‌ మండలం కొరాట గ్రామం వద్ద చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. కేంద్ర జలమంత్రిత్వ శాఖ కూడా తుది అనుమతులు జారీ చేయడంతో త్వరలోనే ట్రయల్ రన్స్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్‌, భీంపూర్‌, జైనథ్‌, బేల మండలాల్లోని 89 గ్రామాల పరిధిలో గల 51 వేల ఎకరాలకు సాగునీరు అందునుంది. ప్రధాన కాలువల కోసం ప్రభుత్వం రూ.397.82 కోట్లు మంజూరు చేసింది. రూ.106.71 కోట్లతో పంప్‌హౌస్‌, లోయర్‌ పెన్‌గంగ ప్రధాన కాలువ నిర్మాణానికి రూ.234.8 కోట్లు, డిస్ట్రిబ్యూటరీల కోసం రూ.148.43 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే బరాజ్‌, ప్రధాన కాలువలు, పంప్‌హౌస్‌ పనులు పూర్తయ్యాయి. 0.83 టీఎంసీల నీటినిల్వ గల బరాజ్‌కు 23 పిల్లర్లతో గేట్లు బిగించారు. సాగు భూములకు నీటిని సరఫరా చేసేందుకు 47 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మించాల్సి ఉండగా పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు 129 బ్రిడ్జిలు నిర్మించారు. ప్రెసర్‌ మెయిన్స్‌కు సంబంధించి 4 కిలోమీటర్ల మేర పైపులు వేశారు. పంప్‌హౌస్‌ నుంచి ప్రెసర్‌ మెయిన్స్‌కు నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి కాలువలకు నీటిని విడుదల చేస్తారు.

జలశక్తి సంఘం అనుమతులు :

తెలంగాణ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో చనాక-కొరాట ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు అందజేసింది. కేంద్ర జల సంఘంలో భాగమైన వివిధ డైరెక్టరేట్‌లు డీపీఆర్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించి ఆమోదం తెలిపాయి. చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణం వల్ల నాలుగు మండలాలు సస్యశ్యామలంగా మారనున్నాయి. ఇప్పటికే పనులు చివరి దశకు చేరుకోగా అధికారులు త్వరలో ట్రయల్‌ రన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. పంప్‌హౌస్‌ నిర్మాణంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ కింద నాలుగు ఫ్లోర్స్‌ నిర్మించారు. బరాజ్‌లో నీరు నిలిచి చివరి ప్రాంతం నుంచి మూడు కింద ఫ్లోర్స్‌ను నిర్మించారు. కొరాట వద్ద బరాజ్‌లను నిర్మించగా నాలుగు కిలోమీటర్ల దూరంలో పిప్పల్‌కోటి వద్ద పంప్‌హౌస్‌ నిర్మాణం జరుగుతున్నది.

నిల్వ ఉన్న నీటిని పంప్‌హౌస్‌ నుంచి సిస్టర్న్‌కు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి కాల్వల ద్వారా పంట పొలాలకు చేరుతుంది. నీటిని తరలించడానికి పంప్‌హౌస్‌లో మొత్తం ఆరు మోటర్లను బిగించారు. ఇందులో కుడి వైపు కాలువలకు నీటిని తరలించడానికి 3 మోటర్లు 12 మెగావాట్లు.. ఎడమ వైపు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 3 మోటర్లు 5.5 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి ఏర్పాటు చేస్తున్నారు. పంప్‌హౌస్‌లోని మోటర్లను నడిపించేందుకు వీలుగా సమీపంలో 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. నీళ్లను ఎత్తిపోసే సమయంలో మోటర్స్‌ ఆన్‌ చేసేలా, తర్వాత ఆఫ్‌ చేసేలా ప్రత్యేక ప్యానెల్‌ బోర్డులు బిగించారు. కుడి వైపులో ఏర్పాటు చేసిన పైపుల ద్వారా 3 కిలోమీటర్లు, ఎడమ వైపు పైపుల ద్వారా కిలోమీటరు మేర నీటిని ఎత్తు ప్రాంతంలో ఉన్న సిస్టర్న్‌కు తరలించాల్సి ఉంటుంది. రెండు వైపులా మోటర్లు 111 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తి పోస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *