రాష్ట్రం రెండుగా విడిపోయినా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తెలంగాణవారి పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సానా యాదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు పేరుతో తెలంగాణ భూమిపుత్రుల గొంతుకోయాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సానా యాదిరెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో ఏపీ ఫిలిం ఛాంబర్ పేరును తెలుగు ఫిలిం ఛాంబర్‌గా మార్చటానికి చేసిన ప్రయత్నాల్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం. దీంతో ఫిలిం ఛాంబర్‌ను రెండుగా విభజించడానికి ఇరు ప్రాంతాల నుంచి ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. అంతవరకు ఛాంబర్ ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం కమిటీ లేకుండానే ఏపీ నుంచి సి.కల్యాణ్, తెలంగాణ నుంచి బి.నరసింగరావు చర్చలు జరిపారు. అందులో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పాటుకు సి.కల్యాణ్ అంగీకరించడమే కాకుండా సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ నుంచి తెలంగాణ ఫిలిం ఛాంబర్‌కు గుర్తింపు తెస్తానని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత ఛాంబర్ పెద్దలు ఈ వ్యవహారాన్ని తిరగదోడుతూ వద్దనుకున్న ఛాంబర్ పేరు మార్పును ముందుకు తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మా అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. విజయవాడలో ఛాంబర్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి తెలుగు ఫిలిం ఛాంబర్‌గా పేరు మార్చాలనుకోవడం ఇరువైపులా వున్న సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయటంగానే మేము భావిస్తున్నాం. ఈ వ్యవహారాన్ని తెలంగాణ అస్తిత్వంపై దాడిగానే పరిగణిస్తున్నాం. ఏపీ ఫిలిం ఛాంబర్‌ను తెలుగు ఫిలిం ఛాంబర్‌గా మార్చకుండా యధావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం.
ఇప్పటికే రెండు ప్రాంతాల ప్రజల మధ్య అపోహలు, అపార్థాలు ఏర్పడిన నేపథ్యంలో పెద్దలు విజ్ఞతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలా కాకుండా ఒంటెత్తు పోకడలతో, ఏకపక్ష నిర్ణయాలతో, మందబలంతో ముందుకు వెళితే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుందని గుర్తుచేస్తున్నాం. ఏపీ ఫిలిం ఛాంబర్ పేరును తెలుగు ఫిలిం ఛాంబర్‌గా మార్చే కుట్రలకు తెరదించాల్సిందిగా కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు జి.శంకర్‌గౌడ్, యస్. దశరథ్, ప్రధాన కార్యదర్శి సంగకుమార్, సంయుక్త కార్యదర్శి పులి అమృత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Source: నమస్తే తెలంగాణ