mt_logo

రాష్ట్రపతి పాలనకే కేంద్రం మొగ్గు

తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ మరో రెండురోజుల్లో రానుంది. ఆ నోటిఫికేషన్లో రాష్ట్ర ఆవిర్భావ తేదీ ఉంటుందని, అది సుమారు మూడు నెలల గడువుతో ఉంటుందని సమాచారం. కేవలం ఈ మూడునెలలకు తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనవసరమని భావించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. గవర్నర్ నరసింహన్ కూడా రాష్ట్రపతి పాలన ఏర్పాటుచేయాలని ఒక నివేదికను కేంద్రప్రభుత్వానికి పంపించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర కేబినెట్ మంగళవారం సమావేశమై తుదినిర్ణయం తీసుకోనుంది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం ఏర్పాటుచేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పార్టీకి విధేయంగా ఉండే ఎమ్మెల్యేలను మంగళవారం ఢిల్లీలో జరిగే సమావేశానికి కేంద్ర కేబినెట్ నుండి ఆహ్వానం అందిన తరుణంలో ముఖ్యమంత్రి పదవికోసం ఎవరి పద్ధతిలో వారు లాబీయింగ్ చేస్తున్నారు. దిగ్విజయ్ నుండి ఆహ్వానం వచ్చిందని మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి పొన్నాల ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. సీమాంధ్ర సచివాలయ నిర్ణయం, ఉద్యోగుల పంపిణీ, అప్పులు, ఆదాయాల పంపిణీ లెక్కలు, నీటిపారుదల బోర్డుల నియామకం విషయాల్లో ఇంకా నిర్ణయం తీసుకోనందున కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేయడం రాజ్యాంగబద్ధమా? కాదా? అని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *