త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో రైతుల్ని ఆకట్టుకునే ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఇందులో భాగంగా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని అమలు చేయనుంది. సోమవారం జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చిన్న, సన్నకారు రైతుల సంక్షేమమే ప్రధాన అంశంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రైతులకు ప్రకటించే ప్యాకేజీపై వ్యవసాయ మంత్రిత్వశాఖ పలు ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం.
మరో నెల రోజుల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి రాబోతుండటం, అనంతరం మరి కొద్ది రోజుల్లోనే లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో సోమవారం జరిగే క్యాబినెట్ భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుంది. వ్యవసాయానికి సంబంధించి మూడు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటిలో మొదటిది.. వ్యవసాయ పంట రుణాల్ని నిర్ణీత గడువులోగా చెల్లించిన రైతుల వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం. రెండవది.. ఆహార ధాన్యాలపై ప్రస్తుతం రైతులు చెల్లిస్తున్న భీమా ప్రీమియం పూర్తిగా మాఫీ చేయడం. మూడవది.. తెలంగాణలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నేతృత్వంలో అమలు చేస్తున్న రైతు బంధు తరహాలో అన్నదాతల బ్యాకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయడం. ఇప్పటికే ఒడిశా సర్కార్ కూడా తెలంగాణ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే!.