తెలంగాణ రాష్ట్రంలో గుండె సంబంధిత చికిత్సలు, మందుల కొనుగోలు కోసం ఏటా రూ. 450 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలిసింది. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గత నాలుగేళ్ళుగా ఏటా సగటున రూ. 206 కోట్ల వరకు ఖర్చు చేయగా మెడికల్ ఇన్సూరెన్స్ సంస్థలు అందించే ఇన్సూరెన్స్, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఆయా సంస్థలు ఇచ్చే మెడికల్ రీయింబర్స్మెంట్, సొంతంగా చేసే ఖర్చు మొత్తం రూ. 200 కోట్లు వరకు ఉంటుందని అంచనా..
తెలంగాణలో ప్రజల తలసరి ఆదాయం రూ. 1,58,360 కాగా ఆ మొత్తంలో 20 శాతం వరకు కేవలం వైద్యానికే ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో అధిక భాగం గుండె సంబంధిత సమస్యలకే వెచ్చిస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగేళ్ళలో రూ. 825 కోట్లు కేవలం గుండె సంబంధిత వ్యాధుల చికిత్స కోసం వెచ్చించింది. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 665.17 కోట్లు, ప్రభుత్వ దవాఖానలు, సీఎం రిలీఫ్ ఫండ్, ఈహెచ్ఎస్ ద్వారా రూ. 159.83 కోట్లు వరకు ఖర్చు చేశారు.