ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8 అమలు చేసేలా గవర్నర్ ను కేంద్రం ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగ పరిధిలో లేని అంశాలను ప్రస్తావిస్తూ దాఖలైన వ్యాజ్యాలు విచారించబడవని, ఈ విషయంలో న్యాయస్థానాలు కూడా గవర్నర్ కు ఆదేశాలు జారీ చేయవని హైకోర్టు స్పష్టం చేసింది.
సెక్షన్-8 అమలు చేయాలని కోరుతూ దాఖలైన మూడు పిటిషన్లలో రెండు పిటిషన్లపై సోమవారం హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోసలే, జస్టిస్ ఎస్వీ భట్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో శాంతి భద్రతలు ఉంటాయని పార్టీ ఇన్ పర్సన్ ఇచ్చిన సమాధానంపై హైకోర్టు స్పందిస్తూ మీరు పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8 చదివారా? అని, అందులో గవర్నర్ కు కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని ఎక్కడ ఉందని ప్రశ్నించింది. అంతేకాకుండా చట్టంలో లేని విషయాన్ని ఎట్లా ఆదేశిస్తారని నిలదీసింది. సెక్షన్-8 అమలు చేసే అధికారం కేంద్రానికి ఎలా ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది.