mt_logo

దేశ ఆర్థిక వ్యవస్థకు జీవం… హైదరాబాద్‌ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తున్నదని, దేశంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా ఎదుగుతున్నదని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రశంసించారు. హైదరాబాద్‌ దేశానికి గ్రోత్‌ ఇంజిన్‌గా మారిందని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర సాగునీటి రంగానికి ప్రయోజనం కలగడంతోపాటు హైదరాబాద్‌లో పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతున్నదని అభివర్ణించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జీఎంఆర్‌ ఎరీనాలో జరిగిన సమావేశంలో 460 కిలోమీటర్ల జాతీయ రహదారులు, ఏడు పీఆర్‌ఐఎస్‌ ప్రాజెక్టు రోడ్లకు ప్రారంభోత్సవ, భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణను ప్రశంసలతో ముంచెత్తారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తున్నదని చెప్పారు. ఒక రాష్ట్రం ప్రగతి సాధించాలంటే నీరు, కరెంటు, రహదారులు, కమ్యూనికేషన్‌ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ రంగాల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందువరుసలో నిలుస్తున్నదని తెలిపారు. అమెరికాలో రోడ్ల నాణ్యత ఎంత పటిష్ఠంగా ఉంటుందో తెలంగాణ రోడ్లను అంతే ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తామని చెప్పారు. అభివృద్ధి విషయంలో నేడు దేశం హైదరాబాద్‌ను ఆసక్తిగా గమనిస్తున్నదని చెప్పారు. జాతీయ రహదారుల అభివృద్ధితోనే పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధి చెందుతాయని గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పెద్దపల్లి మినహా మిగిలిన 32 జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానమయ్యాయని తెలిపారు. సాధ్యమైనంత తొందరలోనే ఆ జిల్లాను కూడా అనుసంధానం చేస్తామని చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాతీయ రహదారులు ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2040 కిలోమీటర్లున్న జాతీయ రహదారులను నేడు 4996 కిలోమీటర్లకు పెంచామని చెప్పారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య జాతీయ రహదారులను ఉన్నతీకరించాలని, అనుసంధానం చేయాలని, లేని చోట ఏర్పాటు చేయాలని అన్నారు. దీంతో ఈ రాష్ట్రాల మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతమని తెలిపారు. జాతీయ రహదారుల వెంట లాజిస్టిక్స్‌ పారులు నిర్మించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

మూడు నెలల్లో ట్రిపుల్‌ ఆర్‌కు శంకుస్థాపన :

మూడు నెలల్లో హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్‌ ప్రారంభానికి వస్తానని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్‌) పూర్తయిందని తెలిపారు. ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని సినిమా ఇంకా మిగిలే ఉందని ఆయన రింగ్‌రోడ్డును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఎంపీలు కోరిన విధంగా త్వరలోనే ట్రిపుల్‌ ఆర్‌ దక్షిణ భాగానికి సంబంధించి తీపికబురు చెప్తామని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో సత్ఫలితాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో సత్ఫలితాలు వస్తున్నాయని నితిన్‌ గడరీ అన్నారు. రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల్లో తీరని నీటి సమస్య ఉన్నదని, తెలంగాణకు ఆ సమస్య కాళేశ్వరంతో తీరిందని చెప్పారు. హైదరాబాద్‌ పారిశ్రామిక, ఐటీ పరిశ్రమల నీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టుగా కాళేశ్వరం మారిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా అనుమతులు ఇచ్చిందని తెలిపారు.

తెలంగాణకు ఐదు గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు :

దేశవ్యాప్తంగా కేంద్రం 26 గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మిస్తున్నదని ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఉంటాయని నితిన్‌గడ్కరీ తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం రూ. 3 లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. రూ. 5 వేల కోట్లతో హైదరాబాద్‌ విశాఖపట్నం హైవే, రూ.12 వేల కోట్లతో నాగపూర్‌ విజయవాడ హైవే నిర్మాణం చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తననెప్పుడు కలిసినా రాష్ట్ర పురోభివృద్ధి గురించి చర్చిస్తారని, అనేక ఉత్తరాలు రాసి తన రాష్ట్రానికి కావాల్సిన సౌకర్యాలను పొందేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ఎంపీలు సైతం తమ ప్రాంతాల పురోభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరతారని, అవకాశాలను, సందర్భాలను బట్టి వాటిని పరిష్కరంచేందుకు ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *