mt_logo

తెలంగాణకు దక్కని జాతీయ రహదారులు!!

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు తక్కువగా ఉన్నాయని, వెంటనే మరో 1,018 కి.మీ కేటాయించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కేంద్రాన్ని అనేకసార్లు కోరారు. మరోవైపు ఆర్అండ్ బీ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్వయంగా ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తెచ్చారు. గతంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన గడ్కరీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించామని, త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన జాతీయ రహదారులపై నిర్ణయం తీసుకోకపోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 700 కిలోమీటర్లు మంజూరు చేసి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అన్యాయం చేసింది.

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జనాభా, ప్రాంతీయ నిష్పత్తి ప్రకారం కేంద్రం జాతీయ రహదారులను కేటాయించాలి. అంతేకాకుండా జాతీయ రహదారులు తక్కువగా ఉన్న రాష్ట్రానికి అదనంగా ఇవ్వాలి. చట్టప్రకారం ఏపీ కంటే తక్కువగా ఉన్న తెలంగాణకు ఎక్కువ కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేయాలి. కానీ ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కూడా తెలంగాణకు జాతీయ రహదారులు ఇవ్వడంలో చొరవ చూపకపోవడం తెలంగాణపై ఉన్న వివక్షను మరోసారి బట్టబయలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలూ తమకు సమానమేనని, రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎప్పుడూ చెప్పే కేంద్రం చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది.

ఏపీ రాష్ట్రానికి ఇప్పటికే 3300 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులుండగా, ప్రస్తుతం జారీ చేసిన వాటితో కలిపి మొత్తం 4000 కి.మీ. లకు చేరాయి. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2600 కిలోమీటర్ల రహదారులు మాత్రమే ఉన్నాయి. కనీసం మరో వెయ్యి కిలోమీటర్లయినా కేంద్రం వెంటనే కేటాయించాల్సి ఉంది. ఇదిలాఉండగా రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మరికొంతమంది అధికారుల బృందం సోమవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఉపరితల రవాణాశాఖ, నేషనల్ హైవేస్ అధికారులను కలుసుకుని ఈ అంశంపై పలు ప్రతిపాదనలను వివరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *