mt_logo

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు దిశగా కేంద్ర ప్రభుత్వం

దేశంలో పేదల నోట్లో మట్టి కొట్టడం కోసమే జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీ వ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి ఉపాధిని దెబ్బ తీసిన కేంద్రం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా నిర్ణ యం తీసుకోవడం శోఛనీయమన్నారు. తక్షణమే కేంద్రం ఆ సర్క్యూలర్‌ను ఉపసంహంరించుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో ప్రజా ఆగ్రహంలో కేంద్రం కొట్టుకు పోతుందని మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డికి హరీష్ రావు ఒక బహిరంగ లేఖ రాశారు. ‘కేంద్రంలోని మీ ప్రభుత్వం ఎలాగు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం లేదు…. కనీసం గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపయోగకారిగా ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసేలా యత్నించడం ఎంత వరకు సమంజసం’ అని కిషన్‌రెడ్డికి రాసిన లేఖలో మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

‘నిరుపేదలు, సామాన్య ప్రజలకు మేలు జరిగే ఒక్క పథకం కూడా మీ కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదా? ఎంతసేపు కార్పొరేట్ సంస్థల యజమాన్యాలకు వత్తాసు పలకడమేనా?’ అని మండిపడ్డారు. నిరుపేదలకు కాస్తో…కూస్తో ఆదాయం, ఆహార భద్రత కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం రద్దు చేసే కుట్రలకు కేంద్రం తెరలేపడం సిగ్గుచేటని ఆ లేఖలో హరీశ్‌రావు ఆరోపించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఉపాధి హామి పథకంపై కేంద్రం తనిఖీలు ప్రారంభించిందన్నారు. కుక్కను చంపడానికి పిచ్చికుక్క అని ముద్ర వేసినట్లు పేదల పాలిట కల్పతరువైన ఉపాధి హామీ పథకంపై అవినీతి ముద్ర వేసి రద్దు చేసే కుట్ర సాగుతున్నట్లు స్పష్టంగా కేంద్రం తీరు అర్థమవుతోందన్నారు. కూలీలు చేసిన పనికి వేతనం చెల్లించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా దాదాపు రూ.10 వేల కోట్ల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని స్వయంగా కేంద్ర మంత్రి ఇటీవల రాజ్యసభలో చెప్పడం నిజం కాదా? అని ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో రూ. 4700 కోట్లు, తెలంగాణ సంబంధించి రూ. 83 కోట్లు చెల్లించలేదని అంగీకరించడం వాస్తవం కాదా? అని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. 2022..20-23 కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి కేవలం రూ. 73 వేల కోట్లు కేటాయించడం దేనికి సంకేతన్నారు. ఇందులో రూ. 18,380 కోట్లు గత ఏడాది చెల్లించాల్సిన బకాయి వేతనాలకే సరిపోతాయి ఇక మిగిలిన నిధులు ఈ పథకం అమలుకు ఏ మూలకు సరిపోతాయన్నారు. దేశంలోని కూలీలతో పాటు రాష్ట్రంలో ఉన్న 57.46 లక్షల జాబ్ కార్డులు కలిగిన 1,21,33,000 మంది ఉపాధి హమీ కూలీల హక్కులను కాలరాయాలని చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కిషన్‌రెడ్డికి రాసిన లేఖలో మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. 2017..20-18లో జరిగిన ఎకనమిక్ సర్వేలో యూనివర్సిల్ బేసిక్ ఇన్‌కమ్‌ను (యుబిఐ) ను ప్రతిపాదించింది మీ ప్రభుత్వమే కదా? అని అడిగారు. ఆ సర్వే ప్రకారం దేశంలో 30 శాతం కుటుంబాలకు సంవత్సరానికి రూ.72 వేల ఆదాయం కల్పించేలా కేంద్రం చర్యలు చేపట్టాల్సి ఉందని తేలిందన్నారు. ఇలాంటి సమయంలో పేదల హక్కుగా ఉన్న ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ, అర్థం పర్థంలేని నిబంధనలు పెట్టి, నిధుల్లో కోత పెట్టి యుబిఐని ఎలా అమలు చేస్తారో కిషన్‌రెడ్డి ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొట్టేవిధంగా ఉందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పని ఎక్కువగా ఎండాకాలంలో జరుగుతుందన్నారు. పనిచేసే వ్యక్తులు ఉదయం 10 గంటలలోపు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు ఒకసారి ఫోటోలు దిగి, అప్ లోడ్ చేయాలని సర్క్యులర్‌లో పేర్కొనడం దారుణమన్నారు.. ఎండాకాలంలో 8 గంటలపాటు పని చేయడం ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. 8 గంటలు పని చేసినా అంతకు మించి పనిచేసినా అందే గరిష్ఠ కూలీ 257 రూపాయలు మాత్రమేనని హరీశ్‌రావు అన్నారు. ఇంత చిన్న మొత్తం కూలీగా చెల్లించడానికి ఇన్ని నిబంధనలా? అని మండిపడ్డారు. 257 రూపాయలతో ఆ కూలీలకు నిజంగా జీవనోపాధి లభిస్తుందా? అని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన అవసరముందన్నారు. పని దినాలను 300 రోజులకు పెంచాలని కోరుతున్నామన్నారు అలాగే కూలీలకు బీమా సౌకర్యం, రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కూలీలు తమ శ్రమ ద్వారా దేశ సంపద పెంచే పనిలో భాగస్వామ్యులవుతుంటే ఆ పథకాన్ని రద్దు చేసే కుట్రకు కేంద్రం ఎందుకు తెరలేపిందో సమాజానికి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

ఎండాకాలం లేదా వానాకాలంలో పని చేసేటప్పుడు కూలీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సదరు సర్క్యూలర్ లో పొందుపరచకపోవడం అమానవీయం కాదా? అని కిషన్‌రెడ్డికి రాసిన లేఖలో మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. పని చేసే వారిని అవమానపరిచేలా వర్క్ సైట్‌లో ఉండి రోజుకు రెండు సార్లు మస్టర్ రోల్ అటెండెన్స్, ఫోటోలు అప్ లోడ్ చేయాలని సర్క్యూలర్ జారీ చేయడం గర్హనీయమన్నారు. 17 ఏళ్ల నుండి ఈ పథకం అమలవుతుంటే ఎన్నడూ లేని విధంగా కొత్త బ్యాంకు అకౌంట్లు తీయాలని ఉపాధి కూలీలను వేధిస్తూ వేతనాలు చెల్లించడంలో మీ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. ఉపాధి హమీ పథకం నుండి కూలీలను దూరం చేసి ఆ తర్వాత ఈ పథకాన్ని రద్దు చేయాలన్న వ్యూహంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోందని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పథకాలకు తూట్లు పొడుస్తూ, క్రమ క్రమంగా వాటిని అటకెక్కించే రహస్య ఎజెండాతో కేంద్రం పని చేస్తోందని అర్థం అవుతోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిన ఫస్ట్ రన్నరప్ ను ఈ పర్యవేక్షణలో భాగం చేయాలని పేర్కొనడం దారుణమన్నారు. సర్పంచ్‌లుగా, ఎంపిటిసిలుగా, వార్డు మెంబర్లుగా ఓడిపోయిన వారందరికి ఈ పథకం పై పర్యవేక్షణ అధికారాలు కల్పించడం ఏంటి? అని ప్రశ్నించారు. అసలు రన్నర్ అప్ అనే పదాన్ని వాడటం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని వ్యాఖ్యానించారు. ఓడిపోయిన ప్రజా ప్రతినిధులను వాట్సప్ గ్రూప్ లో చేర్చి ఎప్పటికప్పుడు కూలీలు చేసే పని సమాచారాన్ని వాట్సప్ ద్వారా అధికారులకు చేరవేయాలని సర్క్యులర్ లో పేర్కొడనం… దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. ఈ నిబంధన కూలీలు, ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఏ ప్రతిపాదికన అధికారాలు కట్టబెడతారు? అని నిలదీశారు. అధికారులు చేయాల్సిన పనిని వారికి అప్పగించడంలో మతలబు ఏంటి ఇందులో రాజకీయ కుట్ర కోణం లేకపోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఓడిపోయిన బిజెపి పార్టీ ప్రతినిధులకు అధికారం కట్టబెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టంగా అర్థమవుతోందని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పనులు చేపడుతున్నదని హరీశ్‌రావు అన్నారు. రైతులు దీని వల్ల లబ్ధిపొందుతున్నారు. కానీ గ్రామంలో 20 పనులు మాత్రమే చేపట్టాలని కేంద్రం చెబుతోందన్నారు. దీని వల్ల కూలీలకు పనులను ఎంపిక చేసుకునే అవకాశం సన్నగిల్లుతుందన్నారు. కేంద్రం తీసుకున్నఈ నిర్లయాల వల్ల కూలీలు ఉపాధి హామీకి దూరం అవుతారన్నారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా దేశ ప్రయోజనాలతోపాటు రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సర్క్యులర్లో పేర్కొన్న నిర్ణయాల వల్ల రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్నారు. రాష్ట్రాన్నిదెబ్బతీసే కుట్రలో భాగంగా కేంద్రం ఇలాంటి స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ బిడ్డగా మీరు ఎలా సమర్థిస్తారు? కిషన్‌రెడ్డిని ఆయన ప్రశ్నించారు.

వ్యవసాయానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకాన్ని అనుసంధానం చేయాలని సిఎం కెసిఆర్‌అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పట్టించుకున్న పాపాన పోలేదని ఆ లేఖలో కిషన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా కొర్రీలు పెట్టి, ఆ పథకాన్నే నిర్వీర్యం చేయాలన్న కుట్రకు ఇది నాంది పలుకుతున్నట్లు అర్థం అవుతోందన్నారు. ప్రజలకు మేలు చేసే వ్యవస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ, ప్రజల నోట్లో మట్టికొడుతున్న కేంద్ర ప్రభుత్వంఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *