Mission Telangana

అడుగడుగునా దేశభక్తి పెంపొందించేలా ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు’ : సీఎం కేసీఆర్

భారత దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ’ కార్యక్రమాల నిర్వహించ తలపెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలు వాటి అమలు తీరుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు ఇతర ముఖ్యులతో మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రోజు వారీ జరిగే కార్యక్రమాలను సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఆగస్టు 15 న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతిఇంటి పై జాతీయ జెండా కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భం గా సిఎం సూచించారు. ఇందుకు సంబంధించి 9వ తేదీనుంచే రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీ చేపట్టాలని సంబంధిత అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలు గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో జరగాలన్నారు.

రోజు వారీ కార్యక్రమాలు :

8వ తేదీ స్వతంత్ర భాతర వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవ కార్యక్రమాలు
09: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం.
10 : గ్రామ గ్రామాన మొక్కలు నాటడం., ఫ్రీడం పార్కుల ఏర్పాటు
11 : ఫ్రీడం రన్ నిర్వహణ
12 : రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియాల సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి.
13 : విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సమాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు
14 : సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియాజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్క్రతిక జానపద కార్యక్రమాలు.
ప్రత్యేకంగా బాణాసంచాతో వెలుగులు విరజిమ్మడం.
15 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.
16 : ఏక కాలంలో, ఎక్కడివారక్కడ ’తెలంగాణ వ్యాప్తంగా సమూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ.
17 : రక్తదాన శిబిరాల నిర్వహణ.
18 :’ ఫ్రీడం కప్’ పేరుతో క్రీడల నిర్వహణ
19 : దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైల్లలో ఖైదీలకు పండ్లు స్వీట్ల పంపిణ
20 : దేశభక్తిని, జాతీయ స్పూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు.
21 : అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. దాంతో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం.
22 : ఎల్‌బిస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు జరగనున్నాయి

ప్రారంభ వేడుకలు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా :

వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహాన్ని సీఎం కేసీఆర్ హైదరాబాద్ హెచ్‌ఐససీసీలో ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ఆర్మీ, పోలీస్ బ్యాండుతో రాష్ట్రీయ సెల్యూట్.. జాతీయ గీతాలాపన.. స్వాతంత్య్ర స్పూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, జెడ్‌పి చైర్మన్లు, మేయర్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, అన్నిజిల్లాల రైతుబంధుసమితి అధ్యక్షులు, జెడ్‌పెటిసి సభ్యులు, ఎంపిపిలు, వివిధ కార్పోరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్‌ఒడిలు, జిల్లా కేంద్రాల్లో ఉండే ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ తదితర రక్షణ రంగానికి చెందిన కమాండర్స్, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యాధికారులు, తదితర రెండు వేల మంది ఆహుతుల సమక్షంలో ప్రాంరభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

మరిన్ని కార్యక్రమాలు :

సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ప్రధానంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, స్టార్ హోటల్లు, దవాఖానాల్లో, షాపింగ్ మాల్స్ లో ప్రత్యేకాలంకరణలను చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వ భవనాలు ఇతర ప్రతిష్టాత్మక భవనాలను ముఖ్యమైన పబ్లిక్ ప్లేసుల్లో ఈ పదిహేను రోజుల పాటు విద్యుత్ దీపాలు, ప్రత్యేకాలంకరణలను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ జెండా ఎగరవేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాల, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు, వక్తృత్వ పోటీ, వ్యాస రచన పోటీ, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు… ఉపాధ్యాయులు, లెక్చరర్లకు దేశభక్తి పై కవితారచన పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతిరోజూ ప్రార్థన సమయంలో అన్ని రకాల విద్యాసంస్థల్లో ఎంపిక చేసిన దేశభక్తి గీతాలను మైకుల ద్వారా వినిపించడంతోపాటు రిచర్డ్ అటెన్ బరో నిర్మించి దర్శకత్వం వహించిన గాంధీ సినిమాను రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ప్రభుత్వ,ప్రయివేటు విద్యాసంస్థల విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిరోజూ ప్రదర్శించాలన్నారు.

గ్రామం మండల జిల్లా రాష్ట్ర స్థాయిల్లో ఫ్రీడం కప్ పేరుతో ఆటల పోటీల నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేయాలన్నారు.వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారిని కలుపుకొని ప్రత్యేక ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. పదిహేను రోజుల వేడుకల్లో పంద్రాగష్టు రోజున రాష్ట్రమంతటా ఏక కాలంలో, ఎక్కడివాల్లక్కడ ‘ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన’ జరిపించాలన్నారు. ఇందుకు పోలీసు శాఖ బాధ్యత వహించాలని డిజిపి మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు

స్వాతంత్య్ర సమరం ఇతివృత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కవిసమ్మేళనాలను, ముషాయిరాలను నిర్వహించాలని సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు. వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. యువతీ యువకులు క్రీడాకారులు ఇతర వర్గాల భాగస్వామ్యంతో ఫ్రీడం 2కె రన్ నిర్వహించాలన్నారు. అలాగే స్వాతంత్య్ర స్పూర్తిని రగలించే విధంగా బెలూన్ల ప్రదర్శన జరగాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రక్తదాన శిబిరాలను దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో, జైల్లల్లో, వృద్ధాశ్రమాలల్లో పండ్లు స్వీట్లు పంచాలని సూచించారు.

ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం :

వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామన్నారు. దాంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయితీలు, మండల పరిషత్, జిల్లాపరిషత్ , మున్సిపల్ సహా ప్రజల చేత ఎన్నిక కాబడిన అన్ని రకాల లోకల్ బాడీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ వజ్రోత్సవ సమాశాల్లో స్వాతంత్య్ర పోరాట వీరులకు ఘన నివాళులు అర్పించాలని నిర్ణయించారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 15 ఆగస్టుకు ముందురోజు 14నతాలుకా, జిల్లా కేంద్రాల్లో, హైద్రాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా బాణాసంచా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో ఇన్‌చార్జీ మంత్రి అధ్యక్షులుగా కలెక్టరు, కన్వీనర్ గా వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు.. సభ్యులుగా ప్రత్యేక నిర్వహణ కమిటీలు వేస్తామన్నారు. దేశ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులతో ప్రత్యేక సంగీత విభావరిని నిర్వహించాలన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలను నిరాదరణకు గురైన వర్గాలను గుర్తించి ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని సిఎం అన్నారు. ‘జిల్లా కొక ఉత్తమ గ్రాపంచాయితీని, మున్సిపాలిటీని, పాఠశాల, ఉత్తమ రైతు డాక్టర్, ఇంజనీరు, పోలీస్ అధికారి, తదితర ఉధ్యోగులు, కళాకారుడు, గాయకుడు, కవిని గుర్తించి సత్కరించాలని సిఎం నిర్ణయించారు. రవీంద్రభారతిలో 15రోజుల పాటు స్వాతంత్య్ర సమర స్పూర్తి ఉట్టిపడే విధంగా ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్వహణ కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు, మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డిజిపిమహేందర్ రెడ్డి, వజ్రోత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *