ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా చదువు మధ్యలో ఆపేసి తిరిగి వచ్చిన భారతీయ మెడికల్ విద్యార్థులకు ఇండియాలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వటం సాధ్యంకాదని పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ‘ఏ ఇతర దేశంలోని మెడికల్ కాలేజీలో చదువు మధ్యలో ఆపేసి వచ్చిన విద్యార్థికీ మన దేశంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చే నిబంధన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం-1956లోగానీ, నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం-2019లోగానీ లేదు. విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ‘స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులేషన్స్-2002 పరిధిలోకిగానీ, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సియేట్ రెగ్యులేషన్స్-2021 పరిధిలోకిగానీ రారు. వీరికి భారతీయ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వటానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) ఒప్పుకోదు. అందువల్ల వారికి అడ్మిషన్లు ఇవ్వలేం’ అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. దీంతో దాదాపు నాలుగు నెలలుగా కేంద్రం తమ భవిష్యత్తును కాపాడుతుందని ఎదురుచూస్తున్న 20 వేల మంది విద్యార్థుల భవితవ్యం అంధకారమైంది.
ఖర్చంతా భరిస్తామన్న సీఎం కేసీఆర్… అయినా ససేమిరా అన్న కేంద్రం :
ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలంగాణకు చెందిన 700 మంది మెడికల్ విద్యార్థులకు ఇక్కడి కాలేజీల్లో అడ్మిషన్లు ఇస్తే ఉచితంగా చదివిస్తామని మార్చి 15న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విద్యార్థుల భవిష్యత్తు ఆగం కాకుండా ఉండేందుకు ప్రత్యేక నిబంధన కింద మనదేశంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి మార్చి 30న లేఖ కూడా రాశారు. అవసరమైతే మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచాలని కోరారు. అలాంటి నిబంధనలు ఇప్పటివరకు లేకపోతే కేంద్రం చొరవ తీసుకొని కొత్తగా నిబంధనలు రూపొందించాలని సూచించినప్పటికీ… కేంద్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తమ విద్యార్థులకు కూడా దేశంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గతవారం ప్రధానికి లేఖ రాశారు. విద్యా సంవత్సరం వృథా అవుతుండటంతో చాలా రాష్ట్రాలు ఇదేవిధంగా కేంద్రాన్ని అభ్యర్థించినా నాలుగు నెలలుగా ఉలుకుపలుకు లేకుండా ఉన్న కేంద్రం… తాజాగా సమాధానంతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. అయితే యుద్ధం కారణంగా నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు ఉక్రెయిన్ బాధిత విద్యార్థులు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రత్యేక కేసుగా పరిగణించి తమకోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేశారు.