mt_logo

తెలంగాణ అటవీ సంరక్షణ చర్యలు భేష్… కితాబునిచ్చిన కేంద్ర అధికారుల బృందం

అడవిని మరియు అడవి సంపదను కాపాడటంలో తెలంగాణ అటవీ శాఖ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా ప్రశంసించింది. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం ఆదివారం అమ్రాబాద్ టైగర్ రిజర్వులో పర్యటించింది. అటవీ శాఖ నేతృత్వంలో పులుల అభయారణ్యం పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ది, సంక్షేమ పథకాలను కేంద్ర బృందం పరిశీలించింది. శ్రీశైలం దారిలో మన్ననూరు వద్ద అమ్రాబాద్ టైగర్ రిజర్వు కేంద్రానికి కొత్త్తగా ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని డైరెక్టర్ జనరల్ చంద్రప్రకాశ్ గోయల్, అధికారులతో కలిసి ప్రారంభించారు. అమ్రాబాద్ నుంచి దోమలపెంట వరకు 70 కిమీ మేర రహదారిలో పర్యాటకులు, ప్రయాణీకులు వదిలేసే ప్లాస్టిక్ ను, చెత్తను వెంటనే సేకరించి మన్ననూరులో ఏర్పాటు చేసిన రీ సైక్లింగ్ కేంద్రానికి తరలించేందుకు 15 మంది చెంచులతో కూడిన బృందాన్ని అటవీ శాఖ ఏర్పాటు చేసింది. టైగర్ రిజర్వు కేంద్రాల్లో ఈరకమైన రీ సైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయటం దేశంలోనే మొదటిసారి అని కేంద్రం బృందంలోని అధికారులు అభినందించారు. ఈ ఏర్పాటుతో అభయారణ్యంలో జంతువులకు ప్లాస్టిక్ చేరకుండా అడ్డకట్ట వేయవచ్చని అధికారులు అన్నారు. వేసవిలో వన్యప్రాణులకు నీటి సౌకర్యాన్ని అందించేందుకు వీలుగా సంపెన్ పడేల్ గడ్డి క్షేత్రం వద్ద సోలార్ బోర్‌వెల్ ను అధికారులు ప్రారంభించారు. అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో జంగల్ సఫారీ ద్వారా పర్యటించిన కేంద్ర అధికారుల బృందం అటవీ నిర్వహణపై సంతృప్తిని వ్యక్తం చేశారు. మన్ననూరులో ఉన్న వైజ్ఞానిక, పర్యావరణ కేంద్రాన్ని, జంతు విసర్జితాలు, అవశేషాలను విశ్లేషించి, అధ్యయనం చేసే బయోల్యాబ్ ను ఉన్నతాధికారులు పరిశీలించారు. అచ్చంపేట అటవీ కార్యాలయంలో చౌసింగా పేరుతో మీటింగ్ హాల్, నల్లమల అటవీ ప్రాంతానికి ప్రత్యేకమైక ఔషధ మొక్కలతో కూడిన మెడిసినల్ గార్డెన్ ప్రారంభించటంతో పాటు, కొత్తగా నిర్మించనున్నఅటవీ అమరవీరుల స్థూపానికి కేంద్ర అధికారుల బృందం శంకుస్థాపన చేశారు. అపోలో ఫౌండేషన్ సహకారంతో చెంచు మహిళలకు ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ప్యాకేజింగ్ వర్క్‌షాపును కూడా ఈ సందర్భంగా అధికారులు ప్రారంభించారు. టైగర్ రిజర్వు పరిధిలో వాడేందుకు వీలుగా పర్యావరణ హిత జ్యూట్ బ్యాగులు, ఇతర సామాగ్రిని చెంచులతో తయారు చేయించేందుకు వీలుగా కేంద్రాన్ని మన్ననూరులో అటవీ శాఖ ఏర్పాటు చేసింది. అటవీశాఖ సిబ్బందితో పాటు, గిరిజనులకు అవసరమైన వైద్యం, మందుల సహాయాన్ని ఈ కేంద్రం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర అధికారుల బృందంలో అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ సిపి గోయల్, జాతీయ పులుల సంరక్షణ కేంద్రం అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్‌పి యాదవ్, జాతీయ కంపా సీనియర్ అధికారి రమేష్ పాండే, ఉత్తరప్రదేశ్ పిసిసిఎఫ్ మధుశర్మ ఉన్నారు. కేంద్ర బృందం వెంట రాష్ట్ర పిసిసిఎఫ్ ఆర్. శోభ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *