వ్యవసాయంలో అనుసరించాల్సిన నూతన విధానాలపై గురువారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన అగ్రికల్చర్ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని ములుగు వద్ద గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆవరణలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రూట్స్ నర్సరీని ఐటీ మంత్రి కేటీఆర్ సహా కేబినెట్ సబ్ కమిటీ సందర్శించింది. కమిటీ సభ్యులందరూ పండ్ల ఉద్యానవనంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ మామిడి పండ్ల చెట్లను పరిశీలించారు. అనంతరం మంత్రుల బృందం ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.