mt_logo

ప్రజల మనిషి ధర్మభిక్షం

భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం సాగింది. ఇది దేశ రైతాంగ పోరాటాల్లో అగ్రణ్యమైనది. ప్రజలు సాయుధులై నైజాం ప్రభుత్వాన్ని ఎదిరించారు. సాధారణ బక్కచిక్కిన రైతు తలెత్తుకొని నైజాం నిరంకుశత్వాన్ని సవాలుచేశాడు. అట్టి స్ఫూర్తిని కార్యదీక్షను, పట్టుదలను, ధైర్యాన్ని కమ్యూనిస్టుపార్టీ ప్రజలలో కలిగించింది. సామాన్యుడిని సైనికుడిగా మార్చి తమ హక్కులకోసం బందుకూలను పట్టేటట్టు చేసింది. ఈ పోరాటంలో సుమారు నాలుగువేల మంది అమరులయ్యారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే మూడువేల మంది ఆత్మార్పణం గావించారు.

తెలంగాణలోని ప్రతి పల్లె సాయుధపోరాట స్మృతులను తనలో దాచుకుంది. ఉద్యమాల పురిటిగడ్డ, విప్లవాల ఖిల్లా నల్లగొండలో కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యాన అప్రతిహత పోరాటం సాగింది. నాయకులెందరో ప్రజలను పోరాటం వైపు నడిపించారు. ఎన్నో బాధలను అనుభవించారు. అటువంటి మహానీయులలో యువతరానికి స్ఫూర్తిదాత ప్రజల మనిషి-నిరంతరం కమ్యూనిస్టు విలువలకు-నిజాయితీకి పాటుపడిన వారు బొమ్మగాని ధర్మభిక్షం. నవ సమాజ స్థాపనకు నడుం కట్టి జీవితమే పోరాటమని విద్యార్థి, యువకులను కూడగట్టి చైతన్యపరిచి నిజాం రజాకార్లను, వారి తాబేదారులైన భూస్వామ్య దొరల దురంతాలను ఎదిరించారు.

దున్నేవాడికి భూమి- గీసేవాడికి చెట్టు కావాలని పోరాడారు. వెట్టిచాకిరిని ఎదిరించి చాకలి, మంగలి, కుమ్మరి, గొల్లకుర్మ, గౌడ, హరిజన, గిరిజన సబ్బండజాతిని కూడగట్టారు. భూమిలేని పేదలకు కూలీసంఘాలు పెట్టి ఉద్యమం నడిపిన నాయకులు ధర్మభిక్షం. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, పీడిత ప్రజల విముక్తే లక్ష్యంగా ప్రజాపోరాటాలకు నాయకత్వం వహించారు. ఏనాడు ధర్మం తప్పని నిజమైన కమ్యూనిస్టు నేత బొమ్మగాని ధర్మభిక్షం. తెలంగాణ సాయుధపోరాట వీరునిగా, ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రతినిధిగా ధర్మభిక్షం జీవితం అందరికీ ఆదర్శవూపాయం.వృద్ధాప్యంలో కూడా ప్రజల పక్షాన నిలబడి నిరంతరం శ్రమించిన యోధుడు. 89 సంవత్సరాల జీవితంలో సుదీర్ఘంగా, జీవితాంతం ఏడు దశాబ్దాల పాటు ప్రజాసేవలో కొనసాగిన సంఘ సేవకుడు.

ధర్మభిక్షం తల్లిదండ్రులు 1917 ప్రాంతంలో మునుగోడు మండలం ఊకొండి గ్రామం నుంచి సూర్యాపేటకు వలస వచ్చారు.1922 ఫిబ్రవరి 15న బొమ్మగాని ముత్తిలింగ-గోపమ్మ దంపతులకు జన్మించిన ధర్మభిక్షం చిన్ననాటి నుంచే చదువులో చురుకైన వాడిగా, పాఠశాల విద్యార్థి నాయకుడిగా, మంచి క్రీడాకారుడిగా, ఉత్తమ విద్యార్థిగా ఉపాధ్యాయుల మన్నలను, విద్యార్థుల ప్రేమాభిమానాలను పొందారు. నల్లగొండలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కాలంలోనే వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నారు.

భారత స్వాతంత్రోద్యమ పవనాలు నిజాం సంస్థానంలో చొరబడి నల్లగొండ జిల్లాను తాకగానే వందేమాతరం అంటూ విద్యార్థులను సమీకరించి, వారిలో దేశభక్తి రగిలించి పోరుబాటలో నడిపిన నాయకుడు ధర్మభిక్షం. నిజాం నవాబు జన్మదిన వేడుకలలో పాల్గొన కూడదంటూ చేసిన సమ్మెకు నాయకత్వం వహించారు. నాడు స్వాతంత్రోద్యమానికి, అభ్యుదయ భావాలకు హైదరాబాద్‌లో పట్టుకొమ్మగా ఉన్న రెడ్డి హస్టల్‌ను ధర్మభిక్షం సందర్శించి ఆ స్ఫూర్తితో తిరిగి వచ్చి సూర్యాపేట, నల్లగొండలో విద్యార్థి వసతి గృహలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విద్యార్థులను క్రమశిక్షణ కలిగిన ఆదర్శవిద్యార్థులుగా చైతన్యవంతులుగా తీర్చిదిద్ది దేశభక్తులుగా తయారు చేశారు.

ఆంధ్ర మహాసభ పిలుపుతో గ్రామాలలో కూలీ సంఘాలు, రైతు సంఘాలు ఏర్పడ్డాయి. కౌలు రైతులకు రక్షణ, కూలీరేటు పెంపుదల, భూపంపిణీ, వెట్టిచాకిరి నిర్మూలన కోసం జరుగుతున్న కమ్యూనిస్టు పోరాటాలకు ధర్మభిక్షం ఆకర్షితులయ్యారు. ఆంధ్ర మహాసభ కార్యకర్తగా 1942లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. జనగామ తాలూకాలో విస్నూరు దేశ్‌ముఖ్ వ్యతిరేక పోరాటానికి మద్దతుగా సూర్యాపేటలో సమ్మె జరిపినందుకు నిజాం ప్రభుత్వం అతనిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ సందర్భంగా ఒకటిన్నర సంవత్సరంపాటు రహస్య జీవితం గడుపుతూ జిల్లాలో జరుగుతున్న పోరాటాల్లో పాల్గొన్నారు. 1946లో అరెస్టు అయి జైలు నుంచి తప్పించుకొన్నారు. ఆతర్వాత మరల అరెస్టు చేయగా ఐదున్నర సంవత్సరాలు నల్లగొండ, చంచలగూడ, జాల్నా, ఔరంగబాద్ జైళ్ళలో కఠిన జైలు జీవితం గడిపాడు.

ధర్మభిక్షం కార్మిక సంఘాల స్థాపన ద్వారా శ్రామిక జనంలో చైతన్యాన్ని నూరిపోసి కార్మిక హక్కుల కోసం ఉద్యమించారు. అదేవిధంగా రిక్షా తదితర కార్మికులకు సంఘాలు పెట్టి వారి హక్కుల కోసం పోరాడారు. వృత్తిసంఘాలను ఏర్పాటుచేయటంలో ప్రముఖ పాత్ర ధర్మభిక్షానిదే. నేత, గీత కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి వారి వృత్తుల రక్షణకు ఉద్యమించారు. గీత కార్మికులు ధర్మభిక్షాన్ని గీత జనబాంధవుడుగా కొనియాడుతున్నారు. దున్నేవారిదే భూమి అంటూ నిరుపేదల కోసం భూ పోరాటం నిర్వహించారు. రోజుల తరబడి వారి గుడిసెలలో కార్మికవాడల్లో మకాం వేసి ఉండేవారు.

ధర్మభిక్షం ఉద్యమ నాయకుడిగానే కాకుండా చట్ట సభల్లోనూ ప్రజల పక్షాన నిలిచాడు. 1952లో సూర్యాపేట స్థానం నుంచి, 1957లో నక్రేకల్ నుంచి, 1962లో నల్లగొండ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. నల్లగొండ స్థానం నుంచి పార్లమెంటుకు రెండు సార్లు (1991, 1996) ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు విలువలకు నిజాయితీకి మారుపేరైన ధర్మభిక్షం ఆశయసాధనలో మరింత ముందుకు సాగుదాం.

-ఉజ్జిని రత్నాకర్‌రావు, ఎఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి

(మార్చి 25: ధర్మభిక్షం వర్థంతి, సూర్యాపేటలో కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా..)

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *