mt_logo

పేరులో ఏముంది?

(అనునిత్యం తెలంగాణనే శ్వాసించే జర్నలిస్టు మిత్రుడు పిట్టల శ్రీశైలం గురించి రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొనే వారందరికీ దాదాపుగా తెలుసు. తన వృత్తిలోనే ఉద్యమాన్ని నిలబెడుతూ “మూసీ టీవీ” పేరిట గత అయిదారేళ్ళుగా ఒక వెబ్ చానెల్ ను నడుపుతున్న శ్రీశైలం చాలామంది ఉద్యమకారులకు ఒక స్ఫూర్తి. ఎక్కడ తెలంగాణ మీటింగ్ జరిగిన తన కెమెరా, ఇతర సరంజామాతో ప్రత్యక్షం అయిపోతాడు శ్రీశైలం. దాన్ని వెబ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రపంచం నలుమూలలకు చేరవేస్తాడు. 

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో శ్రీశైలం ఇద్దరు బిడ్డల పేర్ల వెనకున్న ఆసక్తికరమైన కథనం వచ్చింది. కింద దాన్ని చదవచ్చు)

తెలంగాణ కోకిల

చెరబండరాజు పుట్టిన (ఘట్‌కేసర్ దగ్గరున్న అంకుశాపూర్) గడ్డమీద పుట్టినవాణ్ణి. అతడిని ముఖాముఖి చూడలేదు గానీ, నా పన్నెండో ఏట కాబోలు … చెరబండరాజు నివాళి సభ మా ఊర్లో జరగడం మాత్రం బాగా గుర్తుంది. నేల సారమేమో .. చిన్నతనం నుండే ఉద్యమ స్ఫూర్తి ఉండేది నాలో. అందువల్లనే మా అమ్మాయిలకు ‘తెలంగాణ కోకిల’, ‘ముచుకుంద’ అని పేర్లు పెట్టుకున్నాను. ఈ ఇద్దరి పేర్ల వెనక ఉన్న విశేషం గురించి చెప్పేముందు బాల్యం నుండి నా భావజాలంలో వచ్చిన మార్పు గురించి మీతో కొంత పంచుకోవాలి.

స్కూల్లో చదివే రోజులనుండే మూసీనది కాలుష్యానికి వ్యతిరేకంగా, గుట్కా, సారాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో పాల్గొనేవాడిని. ఒకసారి (1996) వివేకవర్థన్ కాలేజీలో ‘మలిదశ తెలంగాణ ఉద్యమ సదస్సు’, ఆ తర్వాత సంవత్సరం గద్దర్ నాయకత్వాన భువనగరిలో మరో పెద్ద సదస్సు జరిగాయి. ఆ సభలో ఎస్. మల్లారెడ్డి, బెల్లి లలితలతో పాటు నేనూ పాల్గొన్నాను. గాదె ఇన్నయ్య రాసిన ‘దగాపడిన తెలంగాణ’ పుస్తకావిష్కరణ అక్కడే జరిగింది.

తర్వాత ఏడాదికి ‘అసెంబ్లీ’లో తెలంగాణ గురించి ఒక ప్రస్తావన వచ్చింది. అప్పటి రాష్ట్రమంత్రి ప్రణయభాస్కర్ ‘దగాపడ్డ తెలంగాణ’ పుస్తకంలో తెలంగాణ దుర్భిక్షం గురించి కూలంకషంగా వివరణ ఉందని సభలో చెబితే, అప్పటి స్పీకర్ ‘తెలంగాణ’ పదం వాడొద్దని, కేవలం ‘వెనకబడ్డ ప్రాంతం’ అనే పదం మాత్రమే వాడాలని అన్నారట. ఈ సంఘటన నా మనసుని కలచి వేసింది. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించడం నాకు కొరుకుడు పడలేదు. నాకు తొలిసారి పుట్టిన అబ్బాయికైనా, అమ్మాయికైనా ‘తెలంగాణ’ పేరు పెట్టుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. నేను పెట్టుకున్న పేరుని ఎట్ల నిషేధిస్తారో చూడాలనే కసి పెరిగింది.

మాకు ఫిబ్రవరి 14, 1999 రోజున అమ్మాయి పుట్టగానే ‘తెలంగాణ’ అని పేరు పెట్టాను. ఆ తర్వాత బెల్లి లలిత హత్యకు గురైనప్పుడు పాత్రికేయుడు ఎస్.కె.జకీర్ ఒక పత్రికలో ‘తెలంగాణ కోకిల ఇక లేరు’ అనే హెడ్డింగ్‌తో ఆర్టికల్ రాయడం నన్ను ఆకర్షించింది. వెంటనే మా అమ్మాయి ‘తెలంగాణ’ పేరుకు చివర ‘కోకిల’ అని చేర్చాను. ‘తెలంగాణ కోకిల’ పేరు మీద బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు అంతా వింతగా చూస్తే, తనని కేంద్రీయ విద్యాలయలో చేర్పించినప్పుడు ఆ పేరు విని అంతా ముక్కున వేలేసుకున్నారు.

టీచర్లు కొందరు ఇష్టం లేకనో ఏమో తెలంగాణ కోకిలకు బదులు పి.టి.కోకిల అని పిలిచేవారట. అదే క్లాసులో ‘వీర వేంకట సాయి సుబ్రహ్మణ్య శర్మ’ లాంటి పొడవైన పేర్లను మాత్రం పూర్తిగా పిలిచే టీచర్లు మా అమ్మాయి పేరుని షార్ట్ చేసి పిలవడం నాకు నచ్చలేదు. ప్రోగ్రెస్ కార్డులో కూడా పి.టి. కోకిల అని రాసేసరికి నాకు కోపం వచ్చింది. వెంటనే టి.సి. తీసుకుని మా అమ్మాయిని తార్నాకలోని మరో స్కూల్లో చేర్చాను.

తర్వాత రెండో పాప (24.12. 2000) పుట్టినప్పుడు మూసీనదికి మరో పేరైన ‘ముచుకుంద’ అని పెట్టాను. హైద్రాబాద్‌లో పారే మూసీ చారిత్రక ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మూసీ కాలుష్యంపై జరిగిన ధర్నాల్లో అప్పటికే ఎన్నోసార్లు పాల్గొన్నాను. ఇప్పటికీ ఎక్కడ ఏ ఉద్యమానికి సంబంధించిన మీటింగులు జరిగినా నాతో పాటు మా తెలంగాణ కోకిల, ముచుకుందాలు వాళ్లకు వాళ్లుగా వచ్చి పాల్గొనడం నాకు సంతోషం కలిగిస్తుంది. మూసీ పేరు మీద ఇష్టంతోనే ‘మూసీ ఆన్‌లైన్ టీవీ ఛానల్’ ఒకటి నడుపుతున్నాను.

– పిట్టల శ్రీశైలం, 99599 96597

ముచుకుంద

ఏడవ తరగతిలో అనుకోకుండా మళ్లీ ముందు చదివిన కేంద్రీయ విద్యాలయలోనే చేరడం జరిగింది నేను. మొదట్ల టీచర్ అటెండెన్స్ పిలిచేటప్పుడు ‘పి.టి. కోకిల’ అనేది. ఈ విషయం నాన్నకు చెబితే ఆయన వచ్చి ప్రిన్స్‌పాల్‌తో కొట్లాడిండు కూడా. ఇప్పుడైతే పూర్తి పేరు పెట్టే పిలుస్తున్నరు. ఈ మధ్య మా స్కూల్లో ఇన్‌స్పెక్షన్ జరిగింది. ఇన్‌స్పెక్షన్ టీమ్‌లో మెంబరైన సిద్దిరాములు సారు ఒకరోజు స్కూలు అసెంబ్లీలో మాట్లాడుతూ “నేను పదేళ్ల క్రితం ఇదే స్కూల్లో టీచర్‌గా పనిచేశాను.

అప్పుడున్న పిల్లల్లో ‘తెలంగాణ కోకిల’ అనే పేరు నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే ఆ అమ్మాయిని మాత్రం మరిచిపోలేదు. ఇప్పుడు ఈ స్కూల్లో ‘తెలంగాణ కోకిల’ ఉందో లేదో” అన్నారు. ఆ సారు మాటలకు అసెంబ్లీలో హాజరైన టీచర్లు, విద్యార్థులు అంతా నావంక చూశారు. నన్ను నిల్చోబెట్టి సారుకు చూపిస్తుంటే, నాకు చాలా గర్వంగా అనిపించింది. నా పేరుకున్న పవర్ అలాంటిది. ఈ పేరు పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంటది.
– తెలంగాణ కోకిల, 9వ తరగతి.

నా పేరు ‘ముచుకుంద’. మూసీ నదిపై ఎంతో ప్రేమతో నాకు ఈ పేరు పెట్టానని నాన్న చెబుతుంటాడు. మొదట్లో పిల్లలు ‘ముచుకుందా’ అని పిలవకుండా ‘మూసీ మూసీ’ అని పిలుస్తూ ఎగతాళి చేసేవారు. ఒక పిలగాడు ‘నీవు మూసీవి, నీ దగ్గర మురికి కాలువ వాసన వస్తది’ అన్నడు. అంతే – ఆ పిలగాని గల్ల పట్టి కొట్టి టీచర్ దగ్గరకు తీసుకపోయి ఫిర్యాదు చేసిన. సార్ కూడా ఆ పిలగాన్ని బాగ తిట్టిండు. అప్పటి నుండి అందరూ ముచుకుందా అనే పిలుస్తున్నారు. ఈ పేరుకు ఎంతో ప్రాముఖ్యత ఉండబట్టే కదా నాన్న ప్రత్యేకంగా ఆ పేరు నాకు పెట్టిండని గర్వంగా అనిపిస్తది.

– ముచుకుంద, 6వ తరగతి

సేకరణ: తహిరో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *