తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి పలు కార్మికసంఘాల నేతలు చేరిన సందర్భంగా వారికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్ఐసీ ఉద్యోగులు కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి త్వరలో రాబోయే అన్ని ఎన్నికల్లో స్వచ్చందంగా ఓటు వేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, బీజేపీతో టీడీపీ పొత్తు వ్యవహారం మనం అర్థం చేసుకోవాలని, పేరుకే బీజేపీ పార్టీ అని, అదొక నాయుడు వర్గం అని, చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు, సీమాంధ్ర బీజేపీ నేతలు ఇద్దరూ పొత్తులపై వ్యతిరేకిస్తున్నా వెంకయ్యనాయుడు ఎందుకు దోస్తీ కట్టించారో చెప్పాలని ప్రశ్నించారు. ఆంధ్రాకు కొమ్ము కాస్తున్న ఇద్దరు బాబులనూ నమ్మొద్దని, 60 ఏళ్ళు గోసపడ్డ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మళ్ళీ మోసపోవద్దని, తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్ళు, నిధులు, నియామకాల కోసం అని, తెలంగాణకు న్యాయం జరగాలని, 85 శాతం ఉన్న బడుగుబలహీన వర్గాల ప్రజల్లో చిరునవ్వును చూడాలని స్పష్టం చేశారు.
తెలంగాణలో అన్ని సమస్యలకూ కారణం టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే అని, ప్రజలకు మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం రావాలని, రాజకీయ అవినీతిని వందశాతం బొంద పెట్టాలని అన్నారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే ప్రభుత్వాలు ఇంత బాగుంటాయా అని ఆశ్చర్యపోతారని, ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందని కేసేఆర్ వ్యాఖ్యానించారు.