mt_logo

ముక్కలవుతున్న బండి సంజయ్ కంచుకోట

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒంటెత్తు పోకడలపై నిప్పు రాజుకుంది. పార్టీలో ఎప్పటినుండో ఉన్నవారిని పట్టించుకోవడం లేదని, పదవులు ఆశించి పార్టీలోకి వచ్చిన వారికే పెద్ద పీట వేస్తున్నాడని పలువురు సీనియర్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం మీద చర్చించడానికి బుధవారం కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హల్ లో ఆ పార్టీ పాతతరం నాయకులు, సీనియర్ నాయకులు దాదాపు వంద మంది వరకూ హాజరయ్యి బండి సంజయ్ మీద సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్టీని బతికించడానికి, పార్టీ సిద్ధాంతం కోసం ఎంతో కాలంగా పని చేసిన నాయకులున్నారని, నక్సలైట్లతో సైతం పోరాడిన నాయకులున్నారని, ఆనాడు బండి సంజయ్ అడ్రెస్ కూడా లేడన్నారు. ఇప్పుడు సీనియర్ నాయకులను పట్టించుకోకుండా, నిర్లక్ష్యం చేస్తున్నాడని.. కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళతో కలిసి బండి సంజయ్ అడ్డ దారులు తొక్కుతున్నాడని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. దశాబ్దాల పాటు సొంత పార్టీలో పనిచేస్తున్న వాళ్ళను కాదని, ఆత్మగౌరవం పేరుతో వేరేవి పార్టీ నుండి వచ్చిన వారిని అందలం ఎక్కించడం ఎంతవరకు న్యాయమని పలువురు ప్రశ్నించినట్టు వినిపిస్తోంది. అలాగే పార్టీలో ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పని చేస్తున్న దళితులను కాదని, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేసిన వారికి మాత్రం పదవులు ఇస్తున్నాడని పలువురు ఆరోపించారు. బండి సంజయ్ అడ్డగోలు నిర్ణయాలపై త్వరలోనే రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించాలని, దీనికి అన్ని జిల్లాల్లోని పాతతరం నాయకులు, సీనియర్ నాయకులు హాజరయ్యి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అసలు విషయాలు కేంద్ర స్థాయికి తీసుకువెళ్లాలనే నిర్ణయానికి ఈ సమావేశం నాంది కావాలని పలువురు సూచించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే బండి సంజయ్ కి కంచుకోటగా ఉన్న కరీంనగర్ క్యాడర్ ముక్కలవడం ఖాయంగా కనిపిస్తోందని పలువురు రాజకీయ విమర్శకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *