2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ నిర్ణయించింది. ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ ప్రకటించింది. బుధవారం కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది.
లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసి వచ్చే నెల 18,19 తేదీల్లో ఆ జాబితాను జాతీయ నాయకత్వానికి అందజేయనున్నారు. ఈ సమావేశంలో లోక్ సభ, శాసనసభ స్థానాలకు కన్వీనర్లు, ఇన్చార్జిల ఎంపికపై చర్చ జరిగింది. పొత్తులగురించి అడుగగా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ, ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, విద్యాసాగరరావు, కే. లక్ష్మణ్, కే. హరిబాబు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రావు, దాసరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
తమ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిన టీడీపీతో పొత్తు పెట్టుకోమని, గతంలో బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ తమ అభ్యర్ధులను నిలబెట్టి ఓడించిందని, అలాంటి పార్టీతో ఎవరూ పొత్తు పెట్టుకోరని ఎస్. వీర్రాజు స్పష్టం చేశారు.
అసెంబ్లీలో విభజన బిల్లుప్రతులను టీడీపీ నేతలు చించివేసిన దృశ్యాల వీడియోను రాష్ట్ర బీజేపీ నేతలు తమ అధినేత రాజ్ నాథ్ సింగ్ కు పంపించారు. గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు మోడీపై చేసిన విమర్శలను, బీజేపీతో పొత్తు చారిత్రక తప్పిదమన్న చంద్రబాబు వ్యాఖ్యలున్న వీడియోనుకూడా రాజ్ నాథ్ కు పంపిస్తామని తెలిపారు. తెలంగాణపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీతో పొట్టు పెట్టుకుంటే తెలంగాణ ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత ఎదురవుతుందని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబుకు ఆహ్వానం అందకపోయినా, ఎవరి ద్వారానో ఆహ్వాన పత్రిక తెప్పించుకొని వచ్చారని బీజేపీ నాయకులు అన్నట్లు సమాచారం.