ప్రపంచ చరిత్రలో ఒక పండుగను పోరాటంతో మమేకం చేసింది బతుకమ్మ పండుగ మాత్రమే. పువ్వులతో దేవతలను పూజించటం సాధారణం కానీ పువ్వులనే దేవతగా పూజించటం బతుకమ్మే చెల్లుతుంది. ఆడపడుచులంతా తమ కష్టాలను, కన్నీళ్లను మరచి తమకు సౌభాగ్యాన్ని ప్రసాదించమని స్థాయి బేధాలు మరచి తొమ్మిది రోజులు బతుకమ్మ పాటలు పాడుతూ మురిసి పోతారు. అలాంటి ఘనమైన పండుగ పుట్టిన తెలంగాణాలో ఈ ఏడాది బతుకమ్మ వేడుకలు మరింత ఘనంగా జరుపుకోవడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బతుకమ్మ పాటను నిర్మించి, విడుదల చేశారు. మిట్టపల్లి సురేందర్ రచించిన ఈ పాటను ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ స్వరపరచగా.. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేశారు. ఉత్తర ఉన్నికృష్ణన్ గాత్రం అందజేసారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఇప్పటికే బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయగా, ఈ పాట బతుకమ్మను మరోసారి ప్రపంచ యవనిక ముందు నిలబెట్టనుంది.

