ఈ నెల 25 నుంచి అక్టోబర్ 3 వరకు కొనసాగే బతుకమ్మ పండుగకు విస్తృత ఏర్పా ట్లు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర రాజధానితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. బతుకమ్మ ఏర్పాట్లపై సోమవారం ఆయన బీఆర్కేభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 3న నిర్వహించే సద్దుల బతుకమ్మకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ను ముస్తాబు చేయాలని సూచించారు. బతుకమ్మ ఘాట్‌తోపాటు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని, విద్యుద్దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఎల్బీ స్టేడియంతోపాటు హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ.. 9 రోజులపాటు కొనసాగే బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైనవని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు, పలువురు అధికారులు, తదితరులు హాజరయ్యారు.