వ్యాపార తెలుగు సినిమాకి సమాంతరంగా తెలంగాణ రీజినల్ సినిమా రూపుదిద్దుకోవాలి. మనదైన తెరమీద, మనదైన సమాంతర సినిమా పరిఢవిల్లాలి. ఆ దిశగా సినీ విమర్శకులు, ఫిల్మ్ సొసైటీ నిర్వాహకులు వారాల ఆనంద్ సాలోచన బతుకమ్మకు ప్రత్యేకం.
అరవై ఏళ్ళ కల సాకారమైన వేళ అన్ని ఉద్రేకాలు, ఉద్వేగాలు ముగిసాయి. అమ్మయ్య అనుకున్నారంతా. సంబురాలు ఉవ్వెత్తున ఎగిసి కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణను తీర్చిదిద్దుకునేందుకు సర్వత్రా చర్చలు, ప్రణాళికలు మొదలయ్యాయి. నిజానికి ఇప్పుడే అసలు పని మొదలు. కవులు, కళాకారులు, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ విజ్ఞతతో, దూరదృష్టితో ఆలోచించి తమ ఆలోచనల్ని రూపుకట్టాల్సిన అవసరముంది. ఈ క్రమంలో అత్యంత ప్రభావశీలమైన సినిమా రంగం గురించి కూడా అందరూ ఆలోచించాలి. సినిమాని కేవలం వినోదంగానో, వాణిజ్యంగానో వదిలేయరాదు. అది తెలంగాణ రాజకీయ ఆర్థిక, సామాజిక జీవన విలువల్ని ప్రభావితం చేసే మాధ్యమం. అందుకే మనందరం సినిమా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ దిశగా కొన్ని ఆలోచనలు పంచుకుంటాను…
నిజానికి వర్తమాన తెలుగు సినిమా శుద్ధ వ్యాపార లక్షణం కలది. కోట్లు పెట్టుబడి పెట్టి మరిన్ని కోట్లు ఎట్లా రాబట్టుకోవాలన్నదే దాని తాపత్రయం. ఈస్థితిలో తెలుగు సినిమా రంగానికి ప్రాంతీయత, సామాజిక బాధ్యత లాంటి మాటలు, భావాలు చెవి కెక్కవు. ఇది కేవలం రూపాయల భాషే మాట్లాడుతుంది. అంతేకాదు, రాబడి రాయితీలు మాత్రమే దానికి వినిపిస్తాయి. తెలుగు సినిమా మద్రాసు నుంచి హైదారాబాద్‌కు తరలి వచ్చినప్పుడు కూడా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీలు, అప్పులు, సబ్సిడీలు చూసే తరలి వచ్చింది. స్టూడియోల నిర్మాణానికి స్థలాల నుంచి ల్యాబ్‌లు, థియేటర్లు ఏర్పాటు చేసుకోవటానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు సమకూర్చారు. వాటిన్నింటినీ అనుభవిస్తూ తెలుగు సినిమా హైదరాబాద్‌లో మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది.
ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఏర్పాటయిన తర్వాత ఎక్కడ, ఏ రాష్ట్రంలో సబ్సిడీలుంటాయి, స్థలాలిస్తారు, టాక్స్ వెసులు బాట్లు ఇస్తారు వంటి లాభదాయకమైన అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాకే తెలుగు సినిమా హైదరాబాద్‌లో వుంటుందా వైజాగ్ తరలిపోతుందా అన్నది సినీ పెట్టుబడిదారులు నిర్ణయిస్తారనిపిస్తోంది. ఇది గమనించే తెలంగాణ నాయకులు అప్పుడే సినిమా వాళ్ళకి హామీలివ్వడం ప్రారంభించారు. ప్రస్తుత తెలుగు సినిమా రంగాన్ని కాపాడుకుంటామని వాగ్దానాలు చేస్తున్నారు. నిజమే. సినిమాని కాపాడాల్సిందే. పెట్టుబడిగా విస్తరించి మంచి ఆదాయ వనరుగా వున్న సినిమా తరలిపోకుండా చూడాల్సిందే. అయితే, మరి తెలంగాణ భాషా సంస్కృతిల మాటేమిటి? తెలంగాణ నేటివిటీ మాటేమిటి? తెలంగాణ తనదైన సినిమా ఆవశ్యకత మాటేమిటి?
ముంబాయిలో హిందీ సినిమా రంగం ఎంత బలంగా ఉన్నప్పటికీ మరాఠీ సినిమా తన గొంతును వినిపిస్తూనే వుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాల్ని అందిస్తూనే వుంది. ఒక్క మరాఠీ సినిమానే కాదు గుజరాతీ, పంజాబీ సినిమాలు కూడా తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. బెంగాలీ, కన్నడ, మలయాళ సినిమాల సంగతైతే చెప్పడానికి లేదు. ప్రపంచ స్థాయిలో ఆయా భాషల చిత్రాలకి వున్న మన్నన, గౌరవం చెప్పడానికి వీలులేదు. ఇలా ఆక్టోపస్‌లా విస్తరించి భారతదేశమంతా మార్కెట్ కలిగివున్న హిందీ సినిమాకి సమాంతరంగా హిందీ రాష్ట్రాల్లో కూడా స్థానిక సినిమాలు నిలదొక్కుకుంటున్నాయి.
దానికి ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ సినిమాలకి రాష్ట్ర ప్రభుత్వాలిస్తున్న ప్రోత్సాహకాలు కూడా ప్రధాన కారణం. ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్ పెట్టి, అకాడమీలు స్థాపించి ఆయా భాషాచిత్రాలకు అంతర్జాతీయ సినిమాని పరిచయం చేశారు. సినిమా మాధ్యమాన్ని కళాత్మక, సామాజిక దృక్పథంతో అర్థం చేసుకునే వెసులుబాటు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కల్పించాయి. అంతేకాదు, ప్రాంతీయ భాషా చిత్రాలకి ఇతోధికమైన ఆర్థిక ప్రోత్సాహకాలూ ఇస్తున్నాయి. మంచి సినిమాకి ప్రేక్షకుల్ని తయారు చేసే పనిని కూడా కేరళ, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి.
వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రస్తుత తెలుగు సినిమాని ప్రోత్సహిస్తూనే సమాంతర తెలంగాణ సినిమా రూపుదిద్దుకునేందుకు ప్రణాళికలు రచించాలి. మొదట తెలంగాణ సినిమా రూపురేఖల్ని తీర్చుదిద్దుకోవాలి. తెలంగాణ భాషలో ఉన్నంత మాత్రాన అది తెలంగాణ సినిమా అవుతుందా? నిజానికి తెలంగాణ సినిమాలో ఏముండాలన్న చర్చ జరగాలి. ఏ రంగు, రుచి, వాసన, ప్రాంతమూ లేని ఆకర్షణీయమైన ప్లాస్టిక్ పువ్వులా ఉన్న తెలుగు సినిమాకి భిన్నంగా సమాంతరంగా తెలంగాణ సినిమా ప్రాంతీయ దృక్పథంతో విశ్వజనీనమైన మానవ విలువల్ని ప్రోది చేస్తూ ఏర్పడాల్సి వుంది. కంటెంట్ పరంగా తెలంగాణ ఆత్మని జొప్పిస్తూ, నిర్మాణపరంగా కళాత్మకతనూ అంతర్జాతీయ స్థాయిని అందుకునే రీతిలో మన సినిమా తయారుకావాల్సి వుంది.
అందుకే, తెలంగాణ సినిమా పునర్నిర్మాణం కాదు, అసలు నిర్మాణమే ఇప్పుడు మొదలుకావల్సి వుంది. దానికి భూమిక సిద్ధం కావాలి. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సినిమాకి ఆర్థిక వెసులుబాటు కల్పించడంతోపాటు ప్రభుత్వ పరంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయాల్సి వుంది. తెలంగాణ సినిమా నడక నేర్చుకుని పరుగెత్తేంత వరకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవాల్సి వుంది. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, తెలంగాణ ఫిలిం అకాడమి, తెలంగాణ ఫిలిం ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్ ఫిలిం ఆర్కైవ్స్ లాంటి సంస్థల్ని ఏర్పాటు చేయాలి. తద్వారా అసలైన తెలంగాణ సినిమాకి తోడ్పాటు లభిస్తుంది. ఇప్పుడు సినిమాకున్న వసతులు, వెసులుబాట్లు కొనసాగిస్తూనే సమాంతరంగా మన సినిమాకి ప్రణాళికలు వేసి అమలు పర్చాలి. తెలంగాణ సినిమాని కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా తొలి సంవత్సరాల్లో చారిత్రక, సాంస్కృతిక వికాస వేదికగా ప్రభుత్వం ప్రోత్సాహకాల్ని అందించాల్సి వుంది.
ఇది కేవలం ప్రభుత్వానిదే బాధ్యతగా కాకుండా తెలంగాణలోని సినీ జీవులు కూడా తమ ఆలోచనని, సృజనని అందించాలి. రీజినల్ సినిమా లక్షణాలతో సినిమాల్ని నిర్మించే యత్నం చేయాలి. ఇన్నేళ్లూ తెలంగాణ రచయితలు, కవులు సినిమా తమ కప్ ఆఫ్ టీ కాదనుకున్నారు. కానీ, తెలంగాణ ఉద్యమ దశాబ్దంలో అత్యద్భుతమైన సృజన చేసిన కవులూ, కళాకారులూ సినిమా మాధ్యమాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సినిమా నిర్మాణానికి ఏం కావాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది.
ఉద్యమ కాలంలో వివిధ సాంస్కృతిక రూపాల్ని ఎట్లా వినియోగించారో అలాగే తెలంగాణ సినిమా నిర్మాణంలో కవులు, రచయితలు ముఖ్య భూమికను పోషించాలి. ఇన్నేళ్లుగా కథలు చెప్పడమూ, రాయడమూ చేసిన కథా రచయితలు ఇప్పుడు తెలంగాణ కథల్ని ఎట్లా చూపించాలో (తెరపైన) ఆలోచించాలి. స్క్రిప్ట్ రచనపైనా, స్క్రీన్‌ప్లే పైనా దృష్టిపెట్టి మనవైన కథల్ని సినిమాకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. కేవలం కథలే కాదు, సినిమాకు సంబంధించిన 24 కళల్లో తెలంగాణ యువత తనదైన ప్రావీణ్యాన్ని సాధించుకోవాలి. ఈ క్రమంలో సినీ మాధ్యమంలో మెలకువలు నేర్చుకునేందుకు సంస్థలు కావాలి. ప్రపంచ సినిమాల్ని వీక్షించేందుకు జిల్లాల కేంద్రాల వారీగా సమాంతర థియేటర్ వ్యవస్థ ఏర్పడాలి.
ప్రభుత్వం తెలంగాణ సినిమాని ప్రత్యేక పరిశ్రమగా గుర్తించి ముందుకు తీసుకెళ్ళాలి. మొత్తం మీద వ్యాపార తెలుగు సినిమాకి సమాంతరంగా తెలంగాణ రీజినల్ సినిమా రూపుదిద్దుకోవాలి. మనదైన తెరమీద మనదైన సమాంతర సినిమా పరిఢవిల్లాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మన సినిమా జెండా ఎగురవేయాలి. అందుకోసం ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకులు, రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకునే కళాకారులు, మేధావులు ప్రణాళికా బద్దంగా కృషి చేస్తారని ఆశిద్దాం.
వ్యాసకర్త మొబైల్ , 94405 01281
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..