mt_logo

సిరులగని సింగరేణిపై సీఎం కేసీఆర్ వరాల జల్లు

సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కాలరీస్ పై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి బొగ్గు నిల్వలు, ఓపెన్ కాస్ట్ మైనింగ్, అండర్ గ్రౌండ్ మైనింగ్, సిబ్బంది, ఉద్యోగులకు అమలుచేస్తున్న సెలవుల విధానం, బొగ్గు తవ్వకాలకు అనుసరిస్తున్న పద్ధతులు, యాంత్రీకరణ అంశాల గురించి సీఎం ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి కాలరీస్ లో కేంద్ర ప్రభుత్వ వాటాను పూర్తిగా కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థగా మార్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కేంద్రప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విధానం (డిజిన్వస్ట్ మెంట్ పాలసీ) ద్వారా సింగరేణిని తెలంగాణ సొంతం చేసుకోవాలని, ఇందుకోసం ప్రధాని నరేంద్రమోడీతో తాను మాట్లాడతానని స్పష్టం చేశారు. సంస్థ పూర్తిగా రాష్ట్రం అధీనంలోకి వస్తే ఇప్పటిదాకా చెల్లిస్తున్న 1200 కోట్ల రూపాయల రాయల్టీ తెలంగాణకే మిగులుతుందని, సింగరేణి సంస్థలో కొత్తగా 6 అండర్ గ్రౌండ్ మైనింగ్ ప్రాజెక్టులు చేపట్టి, దానిద్వారా ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులందరికీ ప్రత్యేకంగా తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన సింగరేణి సిబ్బంది సకలజనుల సమ్మెలో పాల్గొన్న కాలాన్ని సెలవుగా పరిగణించాలని, డిస్మిస్డ్ కార్మికులకు ఒక్కసారి అవకాశం కల్పించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి పరిధిలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని, సింగరేణికి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటుచేయాలని చెప్పారు.

సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులు, సిబ్బంది విషయంలో తెలంగాణ, ఆంధ్ర అనే తేడాను పాటించవద్దని, కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ చెప్పారు. రామగుండం వద్దనున్న 1500 ఎకరాల భూములను ఎన్టీపీసీ ఏర్పాటుచేసే 4000మెగావాట్ల పవర్ ప్లాంటుకు కేటాయించాలని సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్యకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అదానీ లాంటి చిన్న కంపెనీలే విదేశాలకు వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయని, 125 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి విదేశాలలో కూడా బొగ్గు బ్లాకులు కొనుగోలు చేసి బొగ్గు ఉత్పత్తి చేయొచ్చని కేసీఆర్ పేర్కొన్నారు.

సింగరేణిలో కార్మికుల సంఖ్య లక్షా 15 వేల నుండి 60వేలకు తగ్గడానికి కారణమేమిటని సీఎం ప్రశ్నించగా, యాంత్రీకరణ వల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు చెప్పారు. అట్లాయితే అధికారుల సంఖ్య 1800 నుండి 2600 కు ఎందుకు పెరిగిందని నిలదీయడంతో సమాధానం చెప్పలేకపోవడం అధికారుల వంతయింది. రెండున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ప్లాన్ బిగ్-డ్రీమ్ బిగ్ అనే లక్ష్యంతో ముందుకు సాగాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య, తెలంగాణ జెన్కో సీఎండీ డీ ప్రభాకర్ రావు, సీఎం ముఖ్యకార్యదర్శి ఎస్. నర్సింగరావు, సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) రమేష్ కుమార్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *