mt_logo

జూన్ 3 నుండి 30 వరకు బడిబాట : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం బడిఈడు పిల్లలను బడుల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదును పెంచడం కోసం జూన్‌ 3 నుంచి 30వ తేదీ వరకు ‘ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. జూన్‌ 3 నుంచి 10 వరకు ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఎన్‌రోల్‌మెంట్‌డ్రైవ్‌ను చేపడుతామని చెప్పారు. జూన్‌ 13 నుంచి బడులు పునఃప్రారంభమవుతాయని, ఈ సందర్భంగా పండుగ వాతావరణంలో బడులను తెరువాలని సూచించారు. తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించి ప్రభుత్వ బడిపై వారికి భరోసా కల్పించాలన్నారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల డీఈవోలతో బడిబాట కార్యక్రమంపై మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులను సైతం పాఠశాలలకు ఆహ్వానించాలని, మన ఊరు – మన బడి కార్యక్రమంతోపాటు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న విషయాలను వారికి వివరించాలని సూచించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని సర్కారు బడుల రూపురేఖలు మారబోతున్నాయని, ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దనున్నామని సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు భారీగా చేరే అవకాశముందన్నారు. ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య, పాఠశాల విద్యార్థుల గత విజయాలను వివరించి పిల్లలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని వివరించారు. అంగన్‌వాడీ టీచర్లతో ప్రత్యేకంగా మాట్లాడి.. పిల్లలంతా సర్కారు బడులకు వచ్చేలా చూడాలని చెప్పారు. సర్పంచ్‌ల నుంచి మొదలుకుని మంత్రుల వరకు అందరినీ బడిబాటలో భాగస్వామ్యం చేయాలన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *