mt_logo

బాబుపై మండిపడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

శ్రీశైలం రిజర్వాయర్ లో విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ కృష్ణా ట్రిబ్యునల్ కు చంద్రబాబు లేఖ రాయడం పట్ల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం ట్యాంక్ బండ్ పై ఆందోళన చేపట్టారు. పునర్విభజన ప్రకారం 54 శాతం కరెంట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడని, శ్రీశైలం రిజర్వాయర్ లో 834 అడుగుల దాకా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని నిబంధనలు చెప్తున్నాయన్నారు. 1996లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీవో 69 కూడా విడుదల చేశారని, 770 అడుగులు ఉన్నప్పుడు కూడా కరెంట్ ఉత్పత్తి చేశారని గుర్తుచేశారు.

ఇప్పుడు 862 అడుగుల వరకు నీళ్ళున్నా తాగునీటి సమస్య అని, విద్యుత్ ఉత్పత్తి అపాలంటూ కృష్ణా ట్రిబ్యునల్ కు లేఖ రాస్తావా? అసలు నీవు రాజకీయాలకు అర్హుడవేనా? అని ధ్వజమెత్తారు. టీటీడీపీ నేతలు ఏపీ రాష్ట్ర హక్కులకోసం గెలిచినట్లుగా ఉంది. అలాంటప్పుడు వాళ్ళు విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకుంటే బాగుంటుందని కర్నెప్రభాకర్ అన్నారు.

కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, 20 ఏళ్ళు టీడీపీ, 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించిందని, ఇక్కడ బొగ్గు, నీళ్ళు ఉన్నా కూడా విద్యుత్ ప్రాజెక్టులు మాత్రం ఆంధ్రాలో పెట్టారన్నారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నా, న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన కరెంట్ ఇవ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు కారణం ఎవరో తెలంగాణ టీడీపీ నేతలే సమాధానం చెప్పాలని, చంద్రబాబు కుట్రలు ఆపకుంటే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా కార్యాలయాలకు కరెంట్ కట్ చేస్తామని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *