By: కట్టా శేఖర్ రెడ్డి
రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు సాధారణ ఆంధ్ర కార్యకర్తల్లాగా మాట్లాడుతున్నారు. వీధిలో మనిషుల్లాగా వ్యవహరిస్తున్నారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో ఏమీ జరగనట్టు, తమకేమీ తెలియనట్టు, తమకేమీ బాధ్యత లేనట్టు, అకస్మాత్తుగా కొండకు చిల్లుపడి పిడుగులేవో మీద పడినట్టు మాట్లాడుతున్నారు. అమాయకత్వం నటిస్తున్నారు. వాటీస్ దిస్ అని ప్రశ్నిస్తున్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి బండగా చెప్పినదానిని, చంద్రబాబునాయుడు కొంచెం పాలిష్డ్‌గా చెప్పాడు. ఆయన మాట్లాడాడు, ఈయన లేఖ రాశాడు. నిన్నటిదాకా ఏదో ఒకటి తేల్చేయండి అన్నారు. ఇప్పుడేమో ఇలా ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. వీళ్లేమీ పరిష్కారాలు చెప్పరు. పరిష్కారంలో భాగస్వాములు కారు. కానీ చొరవతీసుకున్నవాడిపై పెద్ద పెద్ద బండలు వేయడానికి రెడీగా ఉంటారు. ఇద్దరు మనుషులు, మనసులు, ప్రాంతీయాసక్తులు ఒకటే. అనేకసార్లు రుజువయింది. ఇప్పుడు మళ్లీ తేటతెల్లమైపోయింది. వీళ్లు మారరు. వీళ్లను మార్చేయాలి.
చిత్రం: 2009 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఏమన్నదో చూడండి
—
విభజన నిర్ణయం జరిగాక పంపకాలు జరుగుతాయా లేక ముందుగా పంపకాలు చేసి విభజన చేస్తారా? వీళ్లెప్పుడయినా కుటుంబాలు వేరుపడిన తీరు చూశారా? వీళ్లకు కనీస లోకజ్ఞానమయినా ఉందా? సీమాంధ్ర ప్రజల దురదృష్టం ఏమంటే వారికి భరోసా ఇచ్చే మొనగాడు నాయకుడు లేకపోవడం. ‘ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు విభజన తప్పదు. అన్ని పార్టీలూ విభజనకు అంగీకరించాయి. మేమున్నాం మీకు అండగా. మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. ఆందోళన చెందకండి. కేంద్రం మెడలు వంచి ఆధునిక రాజధాని నిర్మించుకుందాం. లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకుందాం…’అని అక్కడి ప్రజలకు ధైర్యంగా చెప్పే నాయకుడు లేడు. హైదరాబాద్ మీద వ్యామోహం వీళ్లను వివశులను చేస్తున్నది. రాజకీయంగా బలహీనులుగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు తప్ప అని అనుభవజ్ఙులు చెప్పారెప్పుడో. ఇప్పుడు చంద్రబాబు, కిరణ్‌ల విషయంలోనూఅదే జరుగుతున్నది.