mt_logo

అవినీతిలేని పాలన

-సింగపూర్‌కంటే మేలైన పారిశ్రామిక విధానం
-సింగిల్‌విండోతో అనుమతులు సరళీకృతం
-చైనాలో సాధ్యమైతే ఇక్కడ కాదా?
-పారిశ్రామికవేత్తల భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్
-పరిశ్రమల స్థాపనకు 3 లక్షల ఎకరాలు సిద్ధం
-వారం రోజుల్లో సమగ్ర ల్యాండ్ బ్యాంక్
-ప్రచారం కాదు.. వాస్తవిక దృక్పథమే కావాలి
-సీఎం కార్యాలయంలోనే స్పెషల్ ఛేజింగ్ సెల్
-దళిత, గిరిజన బిడ్డలూ పరిశ్రమలు పెట్టాలి
-మెదక్ జిల్లా ఖాదీపల్లిలో ఫార్మాసిటీ
అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణను తయారుచేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విస్పష్టంగా ప్రకటించారు. ఇది తన బాధ్యతని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అనుమతులు, భూ కేటాయింపు వంటి ప్రతి ప్రక్రియనూ పారదర్శకంగా నిర్వహిస్తామని అన్నారు. ఇకపై రియల్‌ఎస్టేట్ రంగానికి కూడా ఏకగవాక్ష విధానం అమలు చేస్తామని చెప్పారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు దళిత, గిరిజన వర్గాల బిడ్డలు కూడా పరిశ్రమలు పెట్టాలని కోరారు. వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. పొరుగురాష్ట్రాల పన్ను విధానాన్ని అధ్యయనం చేస్తామని, దానికి అనుగుణంగా తెలంగాణకు కొత్త విధానం ప్రకటిస్తామని తెలిపారు. మిగతా రాష్ట్రాలకన్నా మన రాష్ట్రంలో పావలా తక్కువ పన్ను ఉండేలా చూస్తామని చెప్పారు.

మంగళవారం తెలంగాణ పారిశ్రామిక విధివిధానాల రూపకల్పనకోసం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల సంఘాల భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొందరు పారిశ్రామికవేత్తలు నా దగ్గరికి వచ్చారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు గతంలో తామొస్తే వాటా కావాలని అడిగారని, దాంతో తాము వెనుకకు వెళ్లిపోయామని చెప్పారు. తెలంగాణలో ఇప్పుడా పరిస్థితులు లేవని, అందుకే మళ్లీ ముందుకొస్తున్నామని అన్నారు. అవినీతిలేని వ్యవస్థను రూపొందిస్తే మొత్తం ఇండస్ట్రీ ఇక్కడికే వస్తుందని కూడా వారు చెప్పారు అని కేసీఆర్ పేర్కొన్నారు. గత పాలకుల వ్యవహారశైలి అలా ఉండడం వల్లే ఇబ్బందులు వచ్చాయని సీఎం చెప్పారు. అందుకే జీరో కరప్షన్ వ్యవస్థ తీసుకురానున్నాం. అది నా బాధ్యత అని ప్రకటించారు. పరిశ్రమల స్థాపనకు అనుమతులు, భూ కేటాయింపులువంటి ప్రతి ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు.

సింగపూర్ కన్నా మేలైన విధానం తెస్తాం
ప్రపంచంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం సింగపూర్‌దని ప్రచారంలో ఉందని, దానికంటే మేలైన సింగిల్‌విండో విధానాన్ని ఇక్కడ అమలుచేసి చూపిస్తామని సీఎం తేల్చిచెప్పారు. దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క రంగానికి ఒక్కో రకమైన దరఖాస్తు ఉంటుంది. వారి ప్రాజెక్టు, పెట్టుబడి, ఉపాధి కల్పనవంటి వివరాలతో దరఖాస్తు అందగానే సదరు కంపెనీలకు సమయమిచ్చి ఆహ్వానిస్తాం. విమానాశ్రయంలోనే ప్రొటోకాల్ అధికారులు స్వాగతం పలికి నేరుగా సీఎం కార్యాలయానికే తీసుకొస్తారు. వారితో కేవలం 15 నిమిషాలు మాట్లాడి ప్రాజెక్టు గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత రెండు వారాల్లోనే వారిని ఆహ్వానించి అన్ని రకాల అనుమతులతో కూడిన పత్రాన్ని నేనే అందజేస్తాను అని చెప్పారు. ఈ సింగిల్‌విండో విధానాన్ని అమలు చేసేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఒక్క కాలుష్య నియంత్రణ మండలి తప్ప మిగిలిన అన్ని అనుమతులు ఒకే సమయంలో సాధ్యమవుతాయని చెప్పారు. ఇప్పుడున్న పీసీబీ విధానాల ప్రకారం మూడు నెలలకోసారి సమావేశమై వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆ పాత విధానాలకు పాతరేస్తాం. ఆధునిక విధివిధానాలే ప్రామాణికంగా అమలు చేస్తాం అని చెప్పారు. గతంలో కొన్ని కంపెనీలు విద్యుదుత్పత్తి ప్రాజెక్టులంటూ వచ్చాయి. 19 ఏండ్లయినా ఒక్క మెగావాట్ ఉత్పత్తి జరుగలేదు. కానీ మళ్లీ చేస్తామంటూ వచ్చారు. సదరు కంపెనీని దగ్గరికి రానివ్వలేదు. కంపెనీలు ఎంవోయూ కుదుర్చుకొని ఇతరులకు అమ్ముకుంటాయి. అలాంటి కంపెనీలు అవసరం లేదు. వాస్తవిక దృక్పథంతో వచ్చేవాటికి స్వాగతం పలుకుతాం. ప్రభుత్వం తరపున అన్ని విధాల సాయంచేస్తాం అని చెప్పారు.

అక్కడ సాధ్యమైంది.. ఇక్కడెందుకు కాదు?
చైనా మ్యాన్యుఫాక్చరింగ్ రంగంలో దూసుకుపోతున్నది. సింగపూర్ విభిన్న రంగాల్లో రాణిస్తున్నది. ఆ దేశాల్లో సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు కాదు? ఐటీకి సిలికాన్‌వ్యాలీ, ఎలక్ట్రానిక్ రంగానికి షెంజాన్ (చైనా) ఎలా ప్రసిద్ధిగాంచాయో, ఆ రెండింటిలోనూ హైదరాబాద్‌కు అంతటి స్థాయి వస్తుంది అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

భూసేకరణ విధానాన్ని సరళీకృతం చేయాలి
నన్ను ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త సీకే బిర్లా కలిశారు. కొత్త భూ సేకరణ విధానం పరిశ్రమల విస్తరణకు అవరోధంగా పరిణమించిందన్నారు. దాన్ని సరళీకృతం చేసుకోగలిగితే పారిశ్రామీకరణ సాధ్యమవుతుందని చెప్పారు అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణకు అతి పెద్ద ల్యాండ్‌బ్యాంక్ ఉండేదని, గత పాలకులు దాన్ని దుర్వినియోగం చేశారని కేసీఆర్ విమర్శించారు. అవసరం లేకపోయినా పెద్ద విస్తీర్ణాలు తీసుకొని నిరుపయోగంగా పడేసిన సంస్థలున్నాయి. వారు ఇకనైనా వినియోగించుకునేందుకు కృషి చేయాలి అని కోరారు. భూమి చాలా విలువైనది. ప్రతి అంగుళాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడున్న 32 లక్షల ఎకరాల బీడు భూముల్లో 20 లక్షలు సాగుకు అనుకూలంగా లేదు. వాటిలో పరిశ్రమలు నెలకొల్పేందుకు మార్గం సుగమంగా ఉంది.

ఇప్పటికిప్పుడు 3 లక్షల ఎకరాలు పరిశ్రమలకు కేటాయించేందుకు అనువుగా ఉందని అధికారులు లెక్క తేల్చారు. మరో వారంలో సమగ్ర ల్యాండ్ బ్యాంక్ వివరాలు వస్తాయి అని తెలిపారు. హైదరాబాద్‌కు 100 కి.మీ. లోపలే ల్యాండ్ బ్యాంక్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ భూమికి మౌలిక సదుపాయాలను కల్పిస్తే సరిపోతుందన్నారు. పాలసీని రూపొందించేందుకు అధికారులతో సుదీర్ఘంగా చర్చించా. పరిశ్రమల రాకకు ఈ విధానం కోర్ సెక్టార్‌గా భావిస్తున్నాం అన్నారు. దీని వల్లే రాష్ట్ర ఆర్థికవ్యవస్థ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. వేల కోట్ల రూపాయలు పెట్టుబడిపెట్టేవారు జీహెచ్‌ఎంసీ, ఇతర కార్యాలయాలకు తిరిగే అవసరం లేకుండా చేసేందుకే సింగిల్‌విండో విధానాన్ని అమలు చేస్తామన్నారు. దీనికోసం రెండేళ్లపాటు కఠినంగానే వ్యవహరిస్తామన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఇవ్వాలని పారిశ్రామికవేత్తలను కోరారు.

స్కిల్ డెవలప్‌మెంట్ పాలసీని అమలు చేస్తాం
అధిక నైపుణ్యాలు ఉన్నవారిని కాలిఫోర్నియా, ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటారు. 85 శాతం ఇంజినీరింగ్ కాలేజీల్లో లాబొరేటరీలు లేవు. పీజీ విద్యార్థులు లేకుండానే పీజీ కాలేజీలు నడుస్తున్నాయి. కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ పాలసీ తీసుకొస్తాం. దళిత ఎంటర్‌ప్రెన్యూర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 నుంచి రూ.300 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉంది అని కేసీఆర్ ప్రకటించారు. నాలుగు రోజుల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో పన్నుల విధానానికి సంబంధించిన అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి టాక్సేషన్ టేబుల్‌ను తయారు చేయాలన్నారు. మిగతా రాష్ట్రాలకన్నా మన రాష్ట్రంలో పావలా తక్కువ ఉండేలా వెంటనే ఆర్డర్ ఇస్తామన్నారు. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

జిల్లాల్లో వచ్చే సమస్యల పరిష్కారానికి కలెక్టర్ నాయకత్వంలో సింగిల్ విండో, ఛేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మెగా ఇండస్ట్రీస్‌కు సంబంధించి సమస్యను, ప్రతీ మూడు నెలలకోసారి సమావేశమై పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు నిర్వహించాల్సిన కర్తవ్యాన్ని గురించి తెలిపేందుకు బంగ్లాదేశ్‌లో సూక్ష్మరుణ పథకం ప్రవేశపెట్టిన నోబెల్ అవార్డు గ్రహీత యూనుస్ గురించి సీఎం ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలోని 70 వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, ప్రభుత్వం కలిసి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. అనుకోకుండా ఏదైనా పరిశ్రమలో ప్రమాదం జరిగినా, నష్టపోయినా, ఇబ్బందిపడినా, సంక్షోభంవచ్చినా ఈ నిధి నుంచి ఆ కంపెనీని కాపాడొచ్చు అని సీఎం చెప్పారు. సేఫ్టీనెట్‌ను పర్‌ఫెక్ట్‌గా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌కు మాస్టర్ ప్లాన్
ఐటీఐఆర్, ఇతర ప్రాజెక్టుల వల్ల హైదరాబాద్‌కు మరో హైదరాబాద్ తోడు కానుందని కేసీఆర్ చెప్పారు. మరో పదేండ్లలో జనాభా 2 కోట్లకు చేరుతుంది. ఫ్లోటింగ్ జనాభా కూడా 60 లక్షలకు చేరుతుంది. దానికి అనుగుణంగానే అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించాను అని కేసీఆర్ వెల్లడించారు. కొంతకాలం క్రితం తాను ఢిల్లీలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగినిపై అఘాయిత్యం జరిగిన సంఘటన విని కలత చెందానని, అందుకే అలాంటి వాటిని పూర్తిగా నియంత్రించేందుకే పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అందుకోసమే ఏ ప్రభుత్వం చేపట్టని వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రూ.320 కోట్లు మంజూరు చేసి ఆధునిక వ్యవస్థను రూపొందించాలని పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, సంఘ విద్రోహక కార్యకలాపాలు, విచ్చలవిడితనం పోవాలన్నారు. అభివృద్ధి దిశలో అడుగులేయడంలో భాగంగా కొన్ని కట్టడాల కూల్చివేతలు చేపడితే కొందరికి బాధ కలుగుతున్నది. దానికి నేనేమీ చేయలేను అని స్పష్టం చేశారు.

సింగరేణి ఇంటర్నేషనల్ ఆపరేటింగ్ కంపెనీ కావాలి
1889లో నెలకొల్పిన సింగరేణి కంపెనీ ఒకప్పుడు కోల్ ఇండియాకు పాఠాలు నేర్పింది. దేశంలో 10 శాతం బొగ్గును ఉత్పత్తి చేస్తున్నది. అయితే చాలా కంపెనీలు ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియావంటి దేశాల్లో మైనింగ్ చేస్తున్నాయి. సింగరేణి మాత్రం ఇక్కడికే పరిమితమైంది. ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఆ పని మనమెందుకు చేయలేమని అధికారులను అడిగాను. దేశ విదేశాల్లోనూ మైనింగ్ జోన్లను లీజుకు తీసుకోవాలని ఆదేశించాను అని తెలిపారు.

తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి ఏర్పాటు
తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలిని ఏర్పాటు చేస్తామని, పరిశ్రమలకు మరో ఏడాది వరకే కరెంటు కోతలని సీఎం భరోసా ఇచ్చారు. అదనంగా సింగరేణిలోని 1200 మెగావాట్లలో మనకు 600 మెగావాట్ల విద్యుత్ అందుతుంది. భూపాలపల్లి నుంచి మరో 600 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. ఏవైనా కోతలుంటే రెండు, మూడు రోజులు ముందుగానే చెప్పే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. ఇంతకు ముందున్న ప్రభుత్వం 60 శాతానికి మంచి విద్యుత్ వాడుకున్నందుకు పరిశ్రమలకు పెనాల్టీ విధించారని పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం పెనాల్టీలు రూ.668 కోట్లు ఉంటే 50 శాతం రూ.330 కోట్లకు తగ్గించారని, ఇప్పటి వరకు రూ.298 కోట్లు కట్టగా రూ.36 కోట్ల రూపాయల బకాయిలున్నాయని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈ మొత్తాన్ని మాఫీ చేస్తున్నట్లు రేపే ఉత్తర్వు జారీ చేస్తామని ప్రకటించారు. అలాగే కాటన్, జిన్నింగ్ మిల్స్‌కు రూ.10 నుంచి రూ.11 కోట్లున్న పెనాల్టీని కూడా మాఫీ చేస్తున్నామని చెప్పారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ కొరత
విద్యుత్ కొరత గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఏర్పడిందని సీఎం చెప్పారు. మూడేళ్లల్లో తెలంగాణను మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులేస్తున్నామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌నుంచి విద్యుత్తు కొనుగోలుకు అవసరమైన పవర్‌లైన్లను వేయాలని సూచించినట్లు తెలిపారు. సోలార్, విండ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటును కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గతానుభావాలను వదిలేయండి. కలిసి పనిచేద్దాం. తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం అని సీఎం కేసీఆర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

రియల్ ఎస్టేట్‌కూ సింగిల్‌విండో విధానం
రాష్ట్రంలో నూతన టౌన్‌షిప్పులు రానున్నాయి. శాటిలైట్ టౌన్స్ ఏర్పాటవుతాయి. ఎన్నెన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పటికే 80 మంది దాకా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులొస్తాయన్నారు. ఈ రంగంలోనూ అనుమతులకు సింగిల్‌విండో విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉన్న పరిశ్రమలను కాపాడుకోవడం మొదటిదైతే, వాటిని విస్తరింపజేయడం రెండోదన్నారు. అలాగే మూడో ప్రాధమ్యంగా పరిశ్రమల స్థాపన అని తన లక్ష్యాలను వివరించారు.

విజన్ ఉన్న సీఎం : సీఎస్ రాజీవ్‌శర్మ
కేసీఆర్ విజన్ ఉన్న ముఖ్యమంత్రని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. అందుకే అందరి భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు. పాలసీ రూపకల్పనకు పారిశ్రామికవేత్తలతో చర్చించడం ప్రాధాన్యమైన అంశమని, ఇదో చారిత్రక దినమని అన్నారు. అభివృద్ధికి వేసే బాటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అవినీతిలేని సమాజాన్ని రూపొందించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ప్రపంచంలో విజయవంతమైన విధానాలను పాఠాలుగా తీసుకొని పారిశ్రామిక విధి విధానాలను తయారు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ పారిశ్రామిక పాలసీని రూపొందించేందుకు పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను, అనుభవాలను పంచుకునేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఫిక్కీ, సీఐఐ, అసోచాం, నాస్కా, టిఫ్, ఎలీప్, ఎంఎస్‌ఎంఈ, ఎఫ్‌ఎస్‌ఎంఈ వంటి సంస్థలను ఆహ్వానించామని, ప్రభుత్వ అంచనాకు మించిన ఆదరణ లభించిందని చెప్పారు. ప్రతి సంస్థ ఇచ్చే సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేశ్‌రంజన్ అధ్యక్షత వహించగా సీఎం ఆఫీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జీ నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, సీఎం అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, పరిశ్రమల శాఖ జేడీ ఎస్ మల్లేశ్, డీడీ ఎస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఫార్మా విస్తరణకు అధ్యయనం
ఫార్మా ఇండస్ట్రీని కాజపల్లి, బొల్లారంలోనేకాక ఇతర ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరాన్ని సీఎం గుర్తించారు. ఇప్పుడున్న ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ విధానాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని అభిప్రాయపడ్డారు. మెదక్ జిల్లా ఖాదీపల్లిలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఫార్మాసిటీలను ఏర్పాటు చేయాలని, దీనిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *