mt_logo

అవినీతి ఆగితేనే అభివృద్ధి

-శ్రీగుణ గటిక

జూలై 16న జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలకు చాలామంది సంతోషపడ్డారు. కొంతమంది సందేహపడ్డారు కూడా. 43 తీర్మానాలు చేస్తే అందులో 30కి పైగా నిర్ణయాలు రాష్ట్ర ఖజానాపై చాలా భారం మోపేవిగా ఉన్నాయి. ఇప్పుడున్న బడ్జెట్ లెక్కలను బేరీజు వేసుకుని చూసి, ఆ పథకాలు అమలు కావడానికి డబ్బులు సమకూరడం ఎలా అనే ప్రశ్న ఆర్థిక నిపుణులు అడుగుతున్నారు. నిజమే. చేయాలనుకున్న పనులన్నీ పూర్తి కావాలంటే చాలా డబ్బులు కావాలి. ఇప్పటికిప్పుడు వేలకోట్ల రూపాయలు ఖజానాలో పడే పరిస్థితి లేదు. అటు కేంద్రమూ పెద్దగా సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. డబ్బులు లేవు కాబట్టి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల నుంచి వెనక్కిపోవాలనే ఆలోచన కేసీఆర్ ప్రభుత్వానికి లేదు. ఈ పరిస్థితుల్లో హామీల అమలుకు, అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులకు మధ్య సమన్వయం కుదర్చడమే ప్రభుత్వం ముందున్న సవాల్.

చాలా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ఎన్నికల్లో విజయం పొందడం కోసం పనికొచ్చే ప్రచార అస్త్రాలుగా చూస్తాయి. కానీ టీఆర్‌ఎస్ మాత్రం ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసే కార్యక్రమాలను మాత్రమే మానిఫెస్టోలో పెట్టుకుంది. ఎన్నికలు జరగడానికి చాలా ముందు నుంచే కేసీఆర్‌కు బలమైన నమ్మకముండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వస్తాం కాబట్టి అమలుకు సాధ్యమయ్యే హామీలే ఇద్దాం, ప్రజలకు అత్యవసరం అనుకున్న పథకాల విషయంలో ఆర్థికభారాన్ని అసలే పట్టించుకోవద్దు అని కూడా చాలా సార్లు చెప్పారు. అందుకే మానిఫెస్టోలో లేని కళ్యాణలక్ష్మి లాంటి కార్యక్రమాన్ని కూడా మానవీయ కోణంతో ప్రవేశపెట్టారు.

తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం, పదేళ్లు అధికారంలో కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఉండి పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నది. ఏ ఒక్క విషయంలో కూడా వెనక్కిపోలేదు. 45 రోజులు పూర్తయింది ఏ పనీ కావట్లేదని సన్నాయినొక్కులు నొక్కినోళ్ల నోళ్లన్నీ ఇప్పుడు మూతపడ్డాయి. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో దేన్నయినా విస్మరిస్తే, దాన్ని పట్టుకుని రాద్దాంతం చేద్దామనుకున్న వారి పప్పులు ఉడకడం లేదు.

ఆర్థికభారం పడుతుంది కాబట్టి అనే సాకుతో ఏ హామీని కూడా విస్మరించలేదు. అయితే ఇక్కడ ప్రశ్నంతా ఈ పథకాలకు అవసరమయ్యే డబ్బులు ఎలా అనేదే. అవినీతి వ్యవస్థీకృతమైంది. ఫిక్స్‌డ్ పర్సంటేజి విధానం అమలవుతుంది. ప్రతీ ఏడాది వివిధ రంగాల్లో 15 వేల కోట్ల అవినీతి జరుగుతుంది. రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు, డ్రైనేజీలు ఇలా ఏ కట్టడం తీసుకున్నా సరే ఎస్టిమేషన్లు వేసే దగ్గర నుంచే అవినీతి ప్రారంభమవుతుంది.

పెన్షన్లు, గృహనిర్మాణం, తెల్లరేషన్‌కార్డులు ఇలా ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా చాలా మంది బోగస్ లబ్ధిదారులే ఉంటున్నారు. ప్రభుత్వం అమలు చేసే ఏ అభివృద్ధి కార్యక్రమమైనా, సంక్షేమ పథకమైనా పేదల దరి చేరకపోవడానికి అవినీతి పెద్ద శాపంలా మారింది. అవినీతి విషయంలో కఠినంగా ఉండకుంటే తెలంగాణ రాష్ట్రంలో మనమేం చేయలేం. ప్రతీ రూపాయి సరిగా వినియోగం కావాలి. దుబారా, విచ్చలవిడితనం ఆగిపోవాలి. అవసరం లేని దగ్గర ఒక్క రూపాయి పెట్టొద్దు. అవసరం అనిపిస్తే వేల కోట్లయినా వెనకాడొద్దు ఈ మాటలను కేసీఆర్ ప్రతీ సందర్భంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు చెబుతున్నారు. అవినీతిని, దుర్వినియోగాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకోవాలన్నది కేసీఆర్ తపనగా కనిపిస్తుంది. చాలా మంది రాజకీయ నాయకుల లాగా కేసీఆర్ ఆలోచించడం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని మంచి మార్గంలో నడిపిస్తున్నాడనే పేరు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నాడు అని అంటున్నారు.

ఇది ముమ్మాటికీ నిజం. అవినీతిని అడ్డుకోగలిగితే, దుర్వినియోగాన్ని, దుబారాను నివారించగలిగితే అద్భుత ఫలితాలు వస్తాయన్నది కేసీఆర్ ఓ సిద్ధాంతంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. రాజకీయ అవినీతి విషయంలో చాలా కఠినంగా ఉండాలని కూడా నిర్ణయించుకున్నారు. ఎంతటి వారైనా అనినీతికి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాననే సంకేతాలు ఇప్పటికే బలంగా పంపారు. అవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి కూడా. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ దగ్గర ఏదైనా పనులకు సంబంధించిన ప్రతిపాదన పెట్టే సందర్భంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. అవినీతికి ఆస్కారంలేని పాలన ముఖ్యమంత్రి, మంత్రుల నుంచే ప్రారంభమయితే అది క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు ఇస్తాయన్న సూత్రం తెలంగాణ రాష్ట్రంలో అమలుకాబోతున్నది. పై స్థాయిలో అవినీతి ఆగిపోతే దాని ప్రభావం క్షేత్రస్థాయిలో బాగా ఉంటుంది.

అభివృద్ధి, దుబారాను అరికట్టే విషయంలో చిత్తశుద్ధిని, వాస్తవికతను పాటిస్తే అవసరమైన కార్యక్రమాలకు బడ్జెట్ ఇబ్బందులుండవు. తెలంగాణకు ఏమాత్రం అవసరం లేని దుమ్ముగూడెం ప్రాజెక్టుకు 20 వేల కోట్లు పెట్టాలనుకుంది గత ప్రభుత్వం. అతీగతీ లేని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు నెలకు రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. లక్షల సంఖ్యలో ఉన్న బోగస్ లబ్ధిదారులకు ఇండ్ల రూపంలో, రేషన్ బియ్యం రూపంలో, ఫీజు రీఇంబర్స్‌మెంటు రూపంలో, పెన్షన్ల రూపంలో వేల కోట్లు దుబారా చేస్తున్నారు. వీటిని క్రమబద్దీకరిస్తే ఎంతో ప్రజాధనం ఆదా అవుతుంది. మంచి కార్యక్రమాల కోసం ఉపయోగపడుతుంది.

అవినీతిరహిత పాలన అందించడం, ప్రభుత్వ పథకాల్లో దుర్వినియోగాన్ని అరికట్టడం, పారదర్శకత పాటించడం, ప్రజల భాగస్వామ్యం పెంచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. దానితో పాటు తెలంగాణకు వచ్చే ఐటీఐఆర్ లాంటి ప్రాజెక్టులు, దేశ విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు పెట్టే పరిశ్రమలు తప్పక తెలంగాణ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. వీటితో పాటు స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు బదలాయించే విషయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానితో పాటు స్థానిక సంస్థలు బాధ్యతలు కూడా పంచుకోనున్నాయి. హక్కుల కోసం కలబడాలి, బాధ్యతలకు నిలబడాలి అనే నినాదం కేసీఆర్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు అందించబోతున్నది.

వందశాతం పన్నులు వసూలు చేసే విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రజలకు ప్రభుత్వ పాలనపై పట్టింపు వస్తుంది. ప్రభుత్వం వేరు, నేను వేరు అనే భావన నుంచి ప్రజలు బయటకు రావాలి. ప్రజలందరి భాగస్వామ్యంతో ఉద్యమం నిర్వహించి తెలంగాణ సాధించిన కేసీఆర్, అదే ప్రజల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రభుత్వాలు తమ పౌరసేవల పట్ల ఎంత ఉదారంగా ఉంటుందో, చట్టాలను ఉల్లంఘించిన వారిపట్ల అంతే కఠినంగా వ్యవహరిస్తుంది. అదే నమూనా ఇప్పుడు తెలంగాణకు అవసరం కూడా.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *