తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి గోల్కొండ కోట నుండి ప్రారంభం కానున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో తలసాని మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ, జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, హెల్త్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ఈనెల 30 న గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాలతో ప్రారంభం కానున్నాయని, ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు జరగనున్నాయని పేర్కొన్నారు. బోనాల జాతరకు భక్తులు లక్షల మంది తరలి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తీ చేస్తున్నట్టు తెలియజేశారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాల జాతర విజయవంతం చేస్తామన్నారు. భక్తులు కూడా అందరికి సహకరించి తమతమ బోనాలు సమర్పించుకోవాని మంత్రి తలసాని సూచించారు.

