mt_logo

లైన్ మెన్‌లుగా మహిళల నియామకం… తెలంగాణ యావత్ లోకానికి ఆదర్శం : మంత్రి కేటీఆర్

యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ రంగంలో 217 మంది మహిళలకు లైన్ మెన్‌లుగా అవకాశం కల్పించడం అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైద‌రాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో ఉన్న జెన్కో ఆడిటోరియంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. లైన్ మెన్‌లుగా ఎంపికయిన మహిళలను మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంలో జరిగిన ఈ నియామకాలు యావత్ భారత దేశానికి మార్గదర్శనం కావాలన్నారు. లైన్ మెన్‌లే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో విద్యుత్ రంగంలో జరిగిన నియామకాలలో 9,644 మంది ఎంపికయితే అందులో 50% మహిళలు ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వ రంగంలో అన్ని శాఖలకు ఈ నియామకాలు ఆదర్శంగా నిలబడాలని ఆయన ఆకాంక్షించారు. లింగ వివక్ష లేని సమాజ నిర్మాణం కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటన్నారని ఆయన చెప్పారు. మహిళలకు విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే మహిళ సాధికారిక సాధించ వచ్చన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని ఆయన చెప్పుకొచ్చారు. మహిళల భద్రతకు తెలంగాణ పెట్టింది పేరు అని.. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, ఆపదలో ఉన్న వారికి హాక్ ఐ మొబైల్ అప్లికేషన్‌లే కారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్ద పీట వేశారనడానికి వీటితో పాటు కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్ పథ‌కం ద్వారా పేదింటి ఆడపడుచులకు కట్నంగా లక్షా నూట పదహారు రూపాయలు అందిస్తున్న ప్రభుత్వ సాయలే అద్దం పడుతున్నాయన్నారు. వీటికి తోడు కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు, వడ్డీ లేని రుణాలు, మాతా శిశు సంరక్షణ కోసం మౌలిక వసతుల కల్పన అన్నింటికీ మించి బిందెడు నీళ్ల కోసం మైళ్ల‌ దూరం నడవకుండా ఉండేందుకు మిషన్ భగీరథ వంటి విప్లవాత్మకమైన ప‌థ‌కాలను రూపొందించిన రూప శిల్పి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. అంతే కాకుండా ఆరోగ్య పరిరక్షణలో మహిళల ఆరోగ్యం కాపాడడంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఫలితాలు సాదించిందన్నారు. ఆరోగ్య పరిరక్షణకు సాలీనా నిధుల కేటాయింపులో యావత్ భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు.

విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్‌కో, జెన్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా పక్షపాతి అని ఆయన నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా ఆ పథకానికి మహిళల పేరు వచ్చేలా చర్యలు తీసుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. 22 సంవత్సరాలుగా ఆయనతో చేసిన సహచర్యంతో మహిళలు అంటే ఎంతటి అభిమానం ఉందన్నది అవగతమైందన్నారు. ముఖ్యంగా ఇంటి పెత్తనం మహిళల చేతిలో ఉన్నట్లయితే దుబారా ఉండదని ఆర్థిక క్రమశిక్షణ ఉంటుందని తద్వారా ఆ కుటుంబం అద్భుతమైన విజయాలు నమోదు చేసుకుంటుంద‌ని నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన తెలిపారు. కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్ ప‌థ‌కంలో భాగంగా ప్రభుత్వం అందించే లక్షా నూట పదహారు రూపాయల చెక్‌ను ఆడపిల్ల తల్లి పేరు మీదనే ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఆయనకున్న దూర దృష్టికి అద్దం పడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *