mt_logo

ఏపీఐఐసీలో సీమాంధ్ర పెత్తనం!

రాష్ట్ర విభజన జరిగినా, ఎన్నికల కోడ్ అమల్లోఉన్నా సీమాంధ్ర ఆగడాలకు హద్దేలేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)లో ఇప్పటికే 85శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులే ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నవిషయం తెలిసీ, అక్కడి సీమాంధ్ర అధికారులు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పోస్టులను అక్కడి వారితోనే భర్తీ చేస్తున్నారు. సివిల్ ఇంజినీర్ పోస్టులు 36, ఎన్విరాన్‌మెంట్ ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు 6 అవసరంలేకున్నా సృష్టించారు. ఒకవైపు సంస్థ నష్టాల్లో ఉందంటూనే మరోవైపు పెద్ద ప్రాజెక్టులు చేపట్టామని, వాటిని సమర్ధవంతంగా పూర్తి చేయడానికి సిబ్బంది అవసరం అని 42పోస్టులను అధికారులు భర్తీ చేశారు.

ఔట్‌సోర్సింగ్ పోస్టులను హార్మోన్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించారు. ఈ కన్సల్టెన్సీ సంస్థతొ ఏపీఐఐసీలో పనిచేసే ఉన్నతాధికారులకు సంబంధం ఉందని, అందుకే ప్రతిపోస్టును, ప్రాజెక్టును ఈ కన్సల్టెన్సీకే అప్పగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యోగులు 10నుండి 20 శాతం కూడా లేకపోగా ఇప్పుడు రాష్ట్ర విభజన సమయంలో కూడా 42పోస్టుల్లో సీమాంధ్రకు చెందిన 25మందికి, మిగతా 17పోస్టులు హైదరాబాద్, రంగారెడ్డికి చెందినవారిగా అడ్రస్ చూపుతూ ఆంధ్రావారికే కేటాయించారు.

రాష్ట్రంలో వేలకోట్ల విలువైన భూముల వ్యవహారాలన్నీ ఏపీఐఐసీ చూస్తుంది. ఈ భూముల్లో అత్యధికంగా హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినవి అయినా, తెలంగాణ అధికారులు కాకుండా సీమాంధ్ర అధికారులే వివిధ కంపెనీలకు కట్టబెడుతుండటంపై తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ విషయమై తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్‌కు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో గవర్నర్ నరసింహన్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్‌లాల్‌కు ఏపీఐఐసీలో జరిగే అక్రమాలపై వినతిపత్రాలు సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *