mt_logo

అపశకున పత్రికలు!

-తెలంగాణ మీద విషకథనాలు
ఆంధ్ర మీడియా తెలంగాణ ప్రయోజనాలను ఓర్వబోదని మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణ ఉద్యమ కాలంనుంచి ఈ ధోరణి ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నా.. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారిన తర్వాత మెళ్లో పేగులు వేలాడేసుకోవడం మరీ శ్రుతి మించుతున్నది. హైదరాబాద్ గవర్నర్‌పాలన ఉదంతంనుంచి నిన్న మొన్నటి శ్రీశైలం విద్యుత్ దాకా గీతకు అవతల ఆంధ్రా వైపు నిస్సిగ్గుగా నిలిచిన ఆంధ్ర మీడియా ఇవాళ పూర్తిగా బరితెగించింది.

అరవై ఏండ్ల ఆరాటంతో రాష్ట్రం సాధించుకుని ఆ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు తీయించాలనే సంకల్పంతో నెలల తరబడి విస్తృత చర్చలు జరిపి రూపొందించిన పారిశ్రామిక విధానం ప్రకటించిన రోజే ఓ విష పదార్థం వండి మొదటి పేజీలో వడ్డించిందో పత్రిక. హైదరాబాద్‌లోని ఫార్మా రంగం పక్కన ఉన్న కర్ణాటకకు తరలిపోతోందనేది సారాంశం. ఇలాంటి అపశకున ఆశీర్వాదాలు తెలంగాణకు కొత్తేం కాదు. కాకులు కావు, కావు మనే అంటాయి తప్ప కోకిలలాగా కుహూ, కుహూ గీతాలు పాడవు. దేవుడి సన్నిధిలో వెలిగించే జ్యోతికి.. సమాధి దగ్గర వెలిగించే జ్యోతికి తేడా ఉంటుంది. అందులో వింతేంలేదు.

గాలి కబుర్లతో గాయి..
ఇంతకీ ఇందులో విషయం ఏమిటీ అంటే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోని సమస్త పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. గుల్బర్గా జిల్లాలో ఓ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తున్నారు. 50 శాతం పన్నురాయితీలు ప్రకటించారు. 20 గంటల కరెంటు వాగ్దానం చేశారు. సదరు వాగ్దానానికి మురిసిపోయి హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలన్నీ రెక్కలు కట్టుకుని అక్కడ వాలబోతున్నాయి. ఇదీ సారాంశం. దానికి తాళింపు ఏంటయ్యా అంటే ఇక్కడ కరెంటు కష్టాలున్నాయి. అందుకని కంపెనీలు వెళుతున్నాయట. ఇంతకీ ఆ నగరం విస్తీర్ణమెంత? జనాభా ఎంత? ఆ నగరానికి ఇతర నగరాలు, దేశాలతో ఉన్న కనెక్టివిటీ ఎంత? ఎంత పెద్ద విమానాశ్రయాలున్నాయక్కడ? ఎన్ని నగరాలకు నేరుగా జాతీయ రహదారులున్నాయి? ఎన్ని రైళ్లను అనుసంధానించే జంక్షన్లున్నాయి?

అక్కడ లభించే మానవ వనరుల లభ్యత ఎంత? అసలు హైదరాబాద్ వదిలేసి ఎందరు సైంటిస్టులు వెళ్లడానికి ఇష్టపడతారు? పరిశ్రమలకు రుణాలు అందించే గొప్పగొప్ప ఆర్థికసంస్థలు ఎన్ని ఉన్నాయక్కడ?.. కనీసం అవగాహన లేకుండా కేవలం తెలంగాణపై ఏదో ఒక విషం కుమ్మరించే ఓ ప్రయత్నమే సదరు కథనం నిండా దర్శనమిస్తుంది. ఒక పరిశ్రమ స్థాపించడానికి అవసరాలేంటో.. అవకాశాలేంటో ఎరుగని అజ్ఞానం టన్నుల కొద్దీ కనపడుతుంది.

అన్ని వర్గాలు హర్షించిన పారిశ్రామిక విధానం..
గురువారం రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ తన రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. స్పష్టమైన విజన్, భారీ కార్యాచరణ ప్రణాళిక, అవినీతి రహిత సింగిల్ విండో విధానం, పలు రాయితీలు ప్రకటించింది. ఈ పాలసీని సభలోని పక్షాలన్నీ హర్షించాయి. ఏకగ్రీవంగా ఆమోదించాయి. పారిశ్రామికవేత్తలు హర్షం ప్రకటించారు. ఒక ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. పరిశ్రమలకు సంబంధించిన అన్ని సమస్యలు, అవసరాలను అందులో స్పృషించారు. పారిశ్రామిక కారిడార్లు ప్రకటించారు. విద్యుత్ విషయం కూడా స్పష్టంగా తెలియపరిచారు. ప్రైవేటు పవర్‌ప్లాంట్లకు అనుమతులిచ్చారు. టారిఫ్‌కూడా నిర్ణయించుకునే హక్కు వారికే ఇచ్చారు. ఇదే ఆంధ్రా మీడియాకు కంటగింపుగా మారింది. అదే ఆ వార్త కథనంలో ప్రతిబింబించింది.

బాబు భజన..
అన్ని విధాలా బేషుగ్గా ఉన్న తెలంగాణలో లేని కష్టాలు చూస్తున్న ఆంధ్రా మీడియాకు తాడూ బొంగరం లేని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెగ అభివృద్ధి కనిపిస్తున్నది. ఆ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెగ అభివృద్ధి పరిచేసినట్టు కథలు కథలుగా పత్రికల్లో కుమ్మరించి తెలంగాణ ఎడిషన్లలో గుప్పిస్తారు. పోనీ అందులో వాస్తవాలుంటాయా అంటే … కోస్తా తీరంమంతా పరిశ్రమలు వచ్చేశాయి అంటూ రాష్ట్రం పుట్టిననాటినుంచి డప్పు వాయిస్తూనే ఉన్నారు. ఇప్పటికి వచ్చింది శూన్యం. ఇక చంద్రబాబు విదేశ పర్యటనలనైతే ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇంతకీ చంద్రబాబు విదేశాలకు వెళ్లి తెచ్చిందేమిటి? జపాన్ పర్యటన నాలుగు రోజులైంది.

ఓ వ్యవసాయక్షేత్రాన్ని, కొన్ని కంపెనీల కర్మాగారాలను చూశారు. ఆహో ఓహో అన్నారు. హోటళ్లలో సమావేశాలు పెట్టి మా రాష్ట్రానికి పెట్టుబడులతో రండి అన్నారు. ఇవాల్టిదాకా సాధించింది ఓ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మాత్రమే. ఇక ఓ నాలుగైదు ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో పెట్టుబడులు పెట్టేవి లేవు. ఒక ఒప్పందం రాజధాని నిర్మాణానికి సంబంధించింది. రెండోది ఆధునిక వ్యవసాయ సాగుకు విధానాలు రూపొందించి నివేదిక ఇస్తుంది.

మూడోది ఇక్కడ పారిశ్రామికీకరణ మీద అధ్యయనం చేస్తుంది. పెట్టుబడులు పెట్టే వాతావరణం కల్పిస్తుంది. ఇంకోటి ఎక్కడెక్కడ పారిశ్రామిక వాడలు పెట్టవచ్చో అధ్యయనంచేసి నివేదికలిస్తుంది. ఆ సమాచారాన్ని జపాన్ సంస్థలకు అందించి ప్రోత్సహిస్తుంది. మరొకటి ఇంకోటి స్మార్ట్ సిటీల నిర్మాణంలో తన అనుభవాన్ని రంగరించి ప్రణాళిక రూపకల్పనలో సహకరిస్తుంది. ఇవన్నీ ఏం చెబుతున్నాయి? అన్నింటికన్నీ అధ్యయనాలు..నివేదికలు.. ప్రణాళికలు.. ప్రోత్సాహాలు తప్ప పెట్టుబడి పెట్టేవి కావు. ఏతా వాతా సాధించింది ఏంటయ్యా అంటే ఒక్క విద్యుత్ కేంద్రానికి మాత్రం పెట్టుబడి. వెనకటికి కాశీకి పోయి ఏదో తెచ్చిండని … అలా ఉంది బాబుగారి జపాన్ యాత్ర.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *