రూ.1 కోటి పది లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కీసర ఎమ్మార్వో నాగరాజు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎమ్మార్వో కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. ఏసీబీ అధికారుల విచారణలో భాగంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో ఎమ్మార్వోతో పాటు కలెక్టర్, కీసర ఆర్డీవో, మరో తాసీల్దార్ పాత్ర ఉందని తేలింది. వరంగల్ జిల్లా హన్మకొండ ఎమ్మార్వో కిరణ్ ప్రకాష్ ద్వారానే ఆర్డీవో రవితో నాగరాజుకి ఒప్పందం కుదిరిందని, కలెక్టర్ తో భూమి మ్యూటేషన్ చేయించే బాధ్యత ఆర్డీవో, ఎమ్మార్వో చూసుకుంటారని ఒప్పందానికి వచ్చినట్లు ఏ 3 నిందితుడు శ్రీనాథ్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే ఆ కలెక్టర్ ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఏసీబీ అధికారులకు లభించిన కోటీ పది లక్షల రూపాయలు వరంగల్ నుండి తీసుకొచ్చినట్లు చెప్పాడు. కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకే భూవివాదంపై మాట్లాడేందుకు గెస్ట్ హౌస్ కు వెళ్లానని ఏ1 నిందితుడు ఎమ్మార్వో నాగరాజు తెలిపాడు. తన తండ్రి గతంలో డిప్యూటీ తాసీల్దార్ గా పనిచేశాడని, ఆయన మరణంతో ఆ ఉద్యోగం తనకు వచ్చినట్లు చెప్పాడు. వివిధ ప్రాంతాల్లో పనిచేసిన తనకు భారీగా ఆస్తులు ఉన్నట్లు ఒప్పుకున్నాడు. 2011 లోనే నాగరాజుపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కేసు బుక్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ ఆస్తుల విలువ రూ. 10 కోట్లు.
తాజాగా అల్వాల్ లో నాగరాజుకు బంధువైన జి. నరేందర్ కు చెందిన బ్యాంకు లాకర్ ఓపెన్ చేయగా అందులో కిలోన్నర బంగారు ఆభరణాలు(రూ. 55 లక్షలు) ఏసీబీ ఆధికారులు స్వాధీనం చేస్కుకున్నారు. వాటిని సీజ్ చేసి ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. మరోవైపు నాగరాజు అక్రమాలపై రోజురోజుకూ ఫిర్యాదులు ఎక్కవవుతున్నాయి. అతడి బారిన పడిన వారిలో సామాన్యుల నుండి ప్రభుత్వ అధికారుల వరకూ ఉన్నారు. ఇప్పుడు వారంతా అతడిపై ఫిర్యాదులు చేస్తున్నారు.