mt_logo

జీవోకు కట్టుబడి కోట్లు నష్టపోయిన తెలంగాణ

దేశంలో ఎక్కడైనా ఒక రాష్ట్రానికి చెందిన వాహనం మరో రాష్ట్రంలోకి వెళ్తే అంతర్రాష్ట్ర పన్ను చెల్లించాల్సిందే. 29 రాష్ట్రాలకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఏది ఏమైనా భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ఒక రాష్ట్రానికి పన్ను వసూలు చేసుకునే అధికారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఏపీలోకి వచ్చే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన వాహనాల నుండి వాహన పన్ను వసూలు చేసుకుంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అంతర్రాష్ట్ర పన్నును వసూలు చేయవద్దంటూ ఏపీ సర్కారు వితండవాదం తెరపైకి తెచ్చింది.

వాహన పన్ను వసూలు నిర్ణయం సమైక్య రాష్ట్రంలో తీసుకున్నదే. అందుకు సంబంధించిన జీవో 43ను జూన్ 1, 2014 న అప్పటి రవాణాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న లక్ష్మీ పార్థసారథి జారీ చేశారు. ఈ జీవో ప్రకారం మార్చి 31, 2015 వరకు ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన వాహన పన్ను విధానం అమల్లో ఉంటుందని, ఆ తర్వాత రెండు రాష్ట్రాలు వేటికవే నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోను కూడా కాదని సీమాంధ్ర మీడియా ఏపీ వాహనదారులకు మద్దతు తెలుపుతుంది.

ఈ జీవో కారణంగా తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ. 50 కోట్ల వరకు నష్టం జరిగినా జీవోను తెలంగాణ ప్రభుత్వం గౌరవించి అమలు చేసింది. ఏపీ సర్కారు మాత్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సాకుగా చూపెడుతోంది. కానీ ఈ చట్టంలో ఎక్కడా వాహన పన్ను వసూలు చేయవద్దని పేర్కొనలేదు. అంతేకాకుండా మోటారు వాహన చట్టంలోని 72వ నిబంధన ప్రకారం తెలంగాణ ప్రభుత్వం పన్ను వసూలు చేసుకోవచ్చనే అంశం స్పష్టంగా ఉంది. నిజానికి జూన్ 2, 2014 నుండే రాష్ట్రానికి సర్వ హక్కులు వచ్చాయి. అప్పటినుండి తెలంగాణ ప్రభుత్వానికి వాహన పన్నులు వసూలు చేసుకునే పూర్తి అధికారం వర్తిస్తుంది. గతంలో విడిపోయిన రాష్ట్రాలు కూడా అధికారికంగా ఏర్పడిన నాటినుండే వాహన పన్నును వసూలు చేశాయి. ఇంత తెలిసినా సీమాంధ్ర ట్రావెల్స్ యజమానులు, సీమాంధ్ర మీడియా, ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై అనవసరంగా రాద్ధాంతం చేయడమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *