ఈ నెల 24వతేదీ మధ్యాహ్నం 12.15 గంటల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్బీనగర్- అమీర్‌పేట మెట్రోరైలు మార్గం అందుబాటులోకి రానుంది. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటి. రామారావు మర్యాదపూర్వకంగా కలుసుకుని ఎల్బీనగర్- అమీర్‌పేట మెట్రోరైలు రాకపోకల ప్రారంభ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించారు.
మంత్రి కేటీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిసినవారిలో ఉన్నారు.
ఎల్బీనగర్-అమీర్‌పేట మెట్రోరైలు అందుబాటులోకి రావడంత నాంపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లాలనుకునేవారు సులువుగా వెళ్లవచ్చు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు బస్సులో వెళ్లాలనుకునేవారికి దిల్‌సుఖ్‌నగర్‌లో లేదా ఎంజీబీఎస్ వద్ద మెట్రోస్టేషన్ అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో మెట్రోరైలును ఎంఎంటీఎస్‌తో అనుసంధానిస్తారు. ఉదాహరణకు, మలక్‌పేట్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, భరత్‌నగర్ వంటి స్టేషన్లతో ఎల్బీనగర్-అమీర్‌పేట్ మెట్రోను కలుపుతారు. ఇందుకోసం విశాలమైన పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు.
ఈ మార్గంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్‌మాళ్లు వంటివి అధికంగా ఉండటం వల్ల మెట్రోరైలు ప్రజలకు ఎంతో సౌలభ్యంగా మారనుంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ దాకా ప్రయాణ సమయం 50% నుంచి 70% దాకా తగ్గుతుంది. 29 కిలోమీటర్ల ఈ దూరాన్ని మెట్రోలో కేవలం 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. సాధారణంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్‌కు బస్సులో ప్రయాణం చేయాలంటే దాదాపు 2 గంటల దాకా పడుతుంది. రద్దీ సమయాల్లోనూ ప్రతి మూడు నుంచి ఐదు నిమిషాలకొక రైలు అందుబాటులో ఉంటాయి. దీంతో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ దాకా రోడ్డు మీద వాహనాల రద్దీ, ట్రాఫిక్ చిక్కులు గణనీయంగా తగ్గే అవకాశముంది.