mt_logo

కాంగ్రెస్ మిత్రుల దీనస్థితి

By టంకశాల అశోక్

గెలువలగల సీట్లు అన్నవి అధిక భాగం అస్పష్టమైనవి. అందుకు కొలమానాలపై ఎవరి వాదనలు వారికి ఉంటాయి. వాటి మధ్య నుంచి టీడీపీ, సీపీఐ, టీజెఎస్‌లు గౌరవప్రదమైనన్ని సీట్లు సంపాదించుకోవలసి ఉంటుంది. తమ దరఖాస్తుదారుల వాదనలను కాదని వారికి సీట్లను కాంగ్రెస్ ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఒక ఎత్తయితే, కాంగ్రెస్‌లోని సీట్లు రాని తిరుగుబాటు అభ్యర్థులు, ఫిరాయింపుదారులను, ఓట్లు బదిలీ కాకపోవటాన్ని తట్టుకుంటూ నిలబడటం మరొక ఎత్తు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలది దీనస్థితి కాగల సూచనలు ఇప్పటి నుంచే కన్పిస్తున్నాయి. అటువంటి స్థితి తమ రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎదురైతే వేరే విషయం. కానీ స్వయంగా మిత్రపక్షం అనుకునే కాంగ్రెస్ నుంచే ఏర్పడితే అది వారిని కుంగదీస్తుంది. ఇటువంటి ప్రమాదం సీట్ల పంపిణీలో ఆరంభమై ఎన్నికల ప్రచారం వరకు కొనసాగితే ఆశ్చర్యపడనక్కరలేదని గత అనుభవాలు చెప్తున్నాయి. ఈ స్పృహ మిత్రపక్షాలకు ఉందా?

కాంగ్రెస్ పార్టీ టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లకు ఎన్ని సీట్లు ఇస్తుందనేది వారి మహాకూటమి నిలబడటానికి ముఖ్యమవుతుంది. ఎన్ని సీట్లయినా విదిలించవచ్చుగాక తమకు కాంగ్రెస్ తప్ప గత్యంతరం లేదని ఆ మూడు పార్టీలు భావిస్తే వేరుగాని, లేనిపక్షంలో ఆ సంఖ్య గౌరవప్రదంగా ఉండాలనుకుంటే మాత్రం వారు గమనించవలసిన విషయాలు కొన్నున్నాయి. మిత్రపక్షాలకు కాంగ్రెస్ నాయకత్వం ఇవ్వగల సీట్లపై ఒక కీలకమైన సూచన, రాష్ట్ర పీసీసీ నాయకులు ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఢిల్లీలో జరిపిన సమావేశంలోలభించింది. కాంగ్రెస్ గెలువగలదని భావించే సీట్లను ఇతరులకు ఇవ్వవద్దన్నారాయన. ఈ ఒక్కమాటను విశ్లేషించినట్లయితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. వెంటనే ముందుగా స్ఫురించే మాట, మనం గెలువలేని వాటిని మిత్రపక్షాలకు ఇద్దామన్నది. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు, తాము గెలిచే వాటిని మిత్రుల కోసం వదులుకోబోమని మళ్లీమళ్లీ అంటున్నారు. కనుక ఈ ప్రశ్నపై ఒక స్పష్టత ఏర్పడిందన్న మాట.

దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండవచ్చు? కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా గల బలమైన పార్టీ. వారు గెలువగల స్థానాలు అనేకం ఉండవచ్చు. అందుకు భిన్నంగా టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు పరిమిత ప్రభావం గల చిన్న పార్టీలు. అవి గెలువగలమని తమకుతాము నమ్ముతున్నవే ఒక చేతివేళ్లపై లెక్కించదగినట్లు ఉన్నాయి. అటువంటిస్థితిలో వారట్లా నమ్ముతున్న సీట్లు, తాము గెలువగలమని కాంగ్రెస్ భావించేవి ఒకటే అయిన పక్షంలో, నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది? ఈ ప్రశ్నపై మీడియాలో ఇప్పటికే కొంత చర్చ నడుస్తున్నది. దానికి అదనంగా గుర్తించవలసినవి కొన్నున్నాయి. సాధారణ పరిస్థితుల్లోనైతే కాంగ్రెస్ కొంత పట్టువిడుపులు చూపి, మిత్రపక్షాలను వెంట ఉంచుకునేటట్లు వ్యవహరించవచ్చు. వారు కోరినన్ని సీట్లు ఇవ్వకపోయినా ఆ సంఖ్య మరీ అవమానకరమనే స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం ఎక్కువ పట్టువిడుపులకు సిద్ధపడకపోవచ్చు. అనగా మిత్రపక్షాలు ఇంచుమించు అవమానకరమనే స్థితికి రాజీ పడవలసి రావచ్చు. విషయం అంతముందుకుపోయిన తర్వాత దానిని దిగమింగక తప్పకపోవచ్చు.

ఇంతకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పట్టువిడుపులు చూపలేని ప్రస్తుత పరిస్థితులు ఏమిటి? ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం. అటువంటి స్థితి కాంగ్రెస్ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కూడా ఉంది. కేంద్ర నాయకత్వపు వైఖరిని నిర్ణయించేది ముందుగా జాతీయ రాజకీయాలు, తర్వాత రాష్ట్ర రాజకీయాలు. జాతీయ రాజకీయాలకు సంబంధించి వారికి ముందుగా నాలుగు అసెంబ్లీల కీలకమైన ఎన్నికలు, ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. ఈసారి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించగలమని కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుని ఉంది. మూడు అసెంబ్లీలలో సొంత మెజారిటీ రాగలదని, లోక్‌సభలో మెజారిటీ కాదు గాని అతిపెద్ద పార్టీ స్థాయి సాధించగలమని అంచనాలు వేస్తున్నారు. పోయినమారు కేంద్రంలో అధికారాన్ని కోల్పోవడమేగాక తమ పార్టీ చరిత్రలో లేనివిధంగా 44 సీట్లకు పడిపోయిన కాంగ్రెస్‌కు, ఎన్నికల గెలుపుతోపాటు తమ కొత్త అధ్యక్షుడు కాస్త సమర్థుడేనని గుర్తింపు తెచ్చుకోవటం జీవన్మరణ సమస్యవంటివి అయ్యాయి. అన్నింటికన్న ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన చందం అయింది. ప్రస్తుత జాతీయ పరిస్థితులు అటువంటివి ఇవీ.

వీటి మధ్య తెలంగాణ ఎన్నికలు కీలకమవుతున్నాయి. ఇక్కడి జయాపజయాల ప్రభావం తక్కిన అన్నింటిపైన ఉంటుంది. తెలంగాణలో అధికారానికి రాగలమని అధిష్ఠానం నిజంగా నమ్ముతున్నదో లేదో తెలియదు గాని, కనీసం గౌరవప్రదమైనన్ని ఓట్లు, సీట్లు రానట్లయితే జాతీయస్థాయిలో తలదించుకోవలసి వస్తుంది. ఓట్ల శాతాలు ఎట్లున్నా ప్రముఖంగా కన్పించేది సీట్లు అయినందున, ఆ సంఖ్య పోయినమారు వచ్చిన 23 కన్నా గణనీయంగా ఎక్కువ కావాలి. ఒకటీ అరా కాదు, గణనీయంగా. అనగా సుమారు 40 ప్రాంతానికి పెరుగాలి. అనగా స్ట్రయిక్ రేట్ అనేది ఆ ప్రాంతంలో ఉండగలదని గట్టి భరోసా పెట్టుకోగల స్థాయిలో సీట్లకు పోటీ చేయాలి. సాధారణ పరిస్థితుల్లో అనండి, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు అనండి, కాంగ్రెస్ బలాబలాలు అనండి, గట్టిగా గెలువగలమనుకునే నాటికి, పోటీచేసే వాటికి నిష్పత్తి రెండున్నర రెట్లు అయినా ఉండాలి. అప్పటికైనా స్ట్రయిక్ రేటు 40 సీట్లకు వస్తుందని కాదు. అది అంతిమంగా అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చెప్తున్న స్థూలమైన లెక్కలు. ఆ లెక్కల ప్రకారం కాంగ్రెస్ వంద సీట్లకు పోటీ చేయాలి. అంతిమంగా ఏమి జరిగేది చెప్పలేం గాని, అదేవిధంగా కాంగ్రెస్ విశ్లేషణలు ఏమిటో గాని, వారు కూడా తాము 90 నుంచి 100 వరకు పోటీ చేయగలమని చెప్తుండటం గమనించదగ్గది.

పైన అనుకున్న జాతీయ పరిస్థితులను బట్టి తెలంగాణ ఎన్నికలు, అక్కడ పోటీ చేయగల, గెలువగల సీట్లు కాంగ్రెస్ అధిష్ఠానానికి కీలకం అవుతుండగా, స్థానిక రాజకీయాల దృష్ట్యా ఇక్కడి పార్టీకి కూడా అంతే కీలకం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దరిమిలా ఇక్కడ ఒక బలమైన ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో తాము మొదటిసారి (2014) అధికారాన్ని కోల్పోవటమే వారికి తీవ్రమైన నిరాశను కలిగించింది. వరుసగా రెండవసారి కూడా అదే జరిగితే ఇక చెప్పనక్కరలేదు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ శక్తులకు అదొక పీడకలగా మారటమే గాక, దేశవ్యాప్తంగా ఫెడరల్ శక్తులు బలపడుతూ కాంగ్రెస్ అనే జాతీయపక్షం క్రమంగా క్షీణిస్తున్న ధోరణి తెలంగాణ అనే కొత్త రాష్ట్రానికి కూడా వ్యాపించినట్లు అవుతుంది. ఈ వ్యాప్తి కాంగ్రెస్‌కు జాతీయస్థాయిలో ఎంత ప్రమాదకరమో, రాష్ట్రస్థాయిలో అంత ముప్పు అవుతుంది. దక్షిణాదిన గల అయిదు రాష్ట్రాల్లో (పుదుచ్చేరి కాకుండా) కాంగ్రెస్‌కు ఎదురులేదు అనే స్థితి ఎక్కడ కూడా ఉండని ఉపద్రవం అది. ఈ పరిస్థితులు ఏర్పడి కొంతకాలం కొనసాగిన చోటనల్లా కాంగ్రెస్ క్షీణిస్తూపోతున్నది. వారికి దార్శనికత, సమర్థత, సంయమనాలు, మేధాశక్తి లేని నాయకత్వాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నిరూపించుకోవలసింది చాలా ఉంది. అందువల్లనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషి ఏ పూచిక పుల్లనైనా పట్టుకునేందుకు తాపత్రయ పడినట్లు, ప్రతి చిన్న పార్టీతో ఎన్నికల మైత్రికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, మహాకూటమి సీట్లు ఎట్లున్నా, తమకు తాము సీట్లు ఎక్కువగా గెలిచి నిరూపించుకోవటం తప్పనిసరిగా మారింది. అందుకోసం వీలైనన్ని ఎక్కువచోట్ల తామే పోటీ చేయాలి. గెలువలగల సీట్లు అన్నవి అధిక భాగం అస్పష్టమైనవి. అందుకు కొలమానాలపై ఎవరి వాదనలు వారికి ఉంటాయి. వాటి మధ్య నుంచి టీడీపీ, సీపీఐ, టీజెఎస్‌లు గౌరవప్రదమైనన్ని సీట్లు సంపాదించుకోవలసి ఉంటుంది. తమ దరఖాస్తుదారుల వాదనలను కాదని వారికి సీట్లను కాంగ్రెస్ ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఒక ఎత్తయితే, కాంగ్రెస్‌లోని సీట్లు రాని తిరుగుబాటు అభ్యర్థులు, ఫిరాయింపుదారులను, ఓట్లు బదిలీ కాకపోవటాన్ని తట్టుకుంటూ నిలబడటం మరొక ఎత్తు. అటువంటి బిక్కుబిక్కుమంటున్న దీనస్థితి వీరిలో ఇప్పటికీ కనిపిస్తున్నది మరి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *