శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరుపై తెలంగాణ ప్రాంత నేతల మధ్య సమన్వయం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. బిల్లును అసెంబ్లీ నుండి పార్లమెంటుకు పంపేదాకా అందరూ ఒకే మాటపై ఉండి, పరస్పర విమర్శలు చేసుకోకుండా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి అన్ని పార్టీల తెలంగాణ నాయకులు 63 మంది, సీనియర్ నేతలు హాజరయ్యారు. తెలంగాణ మంత్రిని శాసనసభ వ్యవహారాల శాఖ నుండి తప్పించి సీమాంధ్ర నాయకుడికి ఆ పదవిని కట్టబెట్టడంతో ఆగ్రహించిన తెలంగాణ వాదులు కలిసికట్టుగా ఉండి సభలో చర్చను ముందుకు తీసుకుపోవాలని, సమైక్య తీర్మానం పెడితే వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నారు. ఇంకా సీమాంధ్ర నేతల వ్యవహారం ఎప్పటికప్పుడు డిల్లీ స్థాయిలో వినిపించడానికి నేషనల్ మీడియాను ఆహ్వానించాలని, విభజన బిల్లుపై మాత్రమే చర్చ చేపట్టాలని తీర్మానాలు చేశారు. అన్ని పార్టీల సభ్యుల మధ్య సమన్వయానికి ఒక కమిటీ వేయాలని నిర్ణయించి ఈ సమన్వయ కమిటీ బాధ్యతను డీ. శ్రీధర్ బాబుకు కేటాయించారు.
సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత మంత్రులు వెంటనే రాజీనామా చేయాల్సిందని, అలా చేస్తే సీఎంకు తగిన బుద్ధి చెప్పినట్లు ఉండేదని అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హారీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణకు చెందిన సభ్యులకు చర్చలో పాల్గొనే అవకాశం వచ్చినట్లయితే దానిని పూర్తిగా ఉపయోగించుకోవాలని, అది అందరు తెలంగాణ సభ్యుల నిర్ణయంగా తీసుకోవాలని స్పీకర్ ను కోరాలని కూడా ఈ సందర్భంగా తీర్మానించారు. అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గైర్హాజరు కాకుండా సభలో పాల్గొనాలని సూచించారు.
సమన్వయ కమిటీ వివరాలు: కాంగ్రెస్ నుండి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర, టీఆర్ఎస్ నుండి ఈటెల రాజేందర్, హరీష్ రావు, టీడీపీ నుండి ఎర్రబెల్లి, మోత్కుపల్లి మరియు బీజేపీ నుండి నాగం జనార్ధనరెడ్డి, యెండల లక్ష్మీనారాయణ తదితరులు సభ్యులుగా ఉండనున్నారు.