రంగారెడ్డి జిల్లా, పరిగి మార్కెట్ యార్డులో విద్యార్ధి గర్జన సభకు ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్, చేవెళ్ళ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సీమాంధ్రులు రోజుకో కుట్రతో తెలంగాణకు అడ్డుపడుతున్నారని, మర్యాదగా తెలంగాణ ఇవ్వకపోతే బరిగీసి కొట్లాడతామని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు అధికారం కోసం కాదని, ఆత్మగౌరవ పోరాటమన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని రాజ్యాంగంలో స్పష్టంగా రాశారని రాజేందర్ వివరించారు.
చేవెళ్ళ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ కోసం 13 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ కే తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సంపూర్ణ తెలంగాణ సాధించే వరకూ పోరాడుతామన్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ళ-ప్రాణహిత ప్రాజెక్టు గురించి పట్టించుకోవడం లేదు అన్నారు.