mt_logo

‘అగ్నిపథ్’ కేంద్ర అనాలోచిత నిర్ణయం : మంత్రి కేటీఆర్

వివాదస్పద అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాలని కేంద్రాన్ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ, దేశపౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా డిమానిటైజేషన్, లాక్ డౌన్, మైనార్టీలతో చర్చించకుండా సిఎఎ వంటి నిర్ణయాలు తీసుకొని దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన కేంద్రంలోని నియంతృత్వ బీజేపీ ప్రభుత్వం, తాజాగా దేశ యువత ఆకాంక్షలకు భిన్నంగా అనాలోచితంగా అగ్నిపథ్ విధానాన్ని తీసుకువచ్చిందని కేటీఆర్ మండిప‌డ్డారు. దేశానికి సేవ చేస్తూ, ఆర్మీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది యువత ఆశలను వంచించే విధంగా కేంద్ర నిర్ణయం తీసుకుందని… పైగా తమ ప్రయోజనాల కోసం ఆందోళన చేస్తున్న యువకుల పైనే నెపాన్ని నెట్టే దుర్మార్గపు ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. ఈరోజు ఈ వివాదాస్పద విధానానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో యువకుడి మృతికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేంద్రం కేవలం తమ అనాలోచిత నిర్ణయాలతో యువకుల ప్రాణాలను బలిగొంటున్నద‌ని అన్నారు. కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి మంత్రి కేటీఆర్ తన సానుభూతిని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *