ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్‌పై అడ్వైజరీ బోర్డు విచారణ ముగిసింది. చర్లపల్లి జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను విచారించారు. పోలీసులతో పాటు రాజాసింగ్ కుటుంబసభ్యులు కూడా విచారణకు హాజరయ్యారు. పోలీసుల తరపున డీసీపీ జోయల్ డేవిస్, మంగళ్హాట్ పోలీసులు హాజరయ్యారు. పీడీ యాక్ట్ పెడ్డడానికి దారితీసిన పరిస్థితులను బోర్డుకు పోలీసులు వివరించారు. పీడీ యాక్ట్ ప్రయోగంపై రాజాసింగ్ అభ్యంతరాలను బోర్డు తెలుసుకుంది.
గత ఆగస్టులో మత ఘర్షణలకు దారితీసేవిధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడంతో మంగళ్‌హాట్, షాహినాథ్‌గంజ్‌లో రాజాసింగ్‌పై పోలీసులు రౌడీషీట్లు ఓఫెన్ చేశారు. యూట్యూబ్ చానల్ ద్వారా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. ఘర్షణలకు తావిచ్చే వ్యాఖ్యలు చేయవద్దని పోలీసుల సూచనలను పట్టించుకోకుండా, పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేశారు. అలాగే రాజాసింగ్ ఓ మతాన్ని కించపరిచేలా వివాదాస్పద మాట్లాడటంతో రాజాసింగ్‌పై హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వందకు పైగా కేసులు నమోదయ్యాయి.
రాజాసింగ్ పై నమోదైన పీడీ యాక్ట్ ఎత్తివేయాలంటే అడ్వైజరీ బోర్డు నిర్ణయం కీలకం కానుంది. నిజానికి పీడీ యాక్ట్ నమోదైన వ్యక్తులు.. జైలులో 3 నెలలు లేదా కనీసం ఏడాది ఉండే అవకాశం ఉంది. అడ్వైజరీ బోర్డు పరిధిలోనే పీడీ యాక్ట్ కేసుల విచారణ జరగనుంది. ముగ్గురు విశ్రాంత న్యాయమూర్తులతో అడ్వైజరీ బోర్డు కమిటీ నియమించారు. ఇప్పటికే బోర్డుకు పోలీసులు సాక్ష్యాలు సమర్పించారు. నిందితుడి వివరాలను అడ్వైజరీ బోర్డు కమిటీ పరిశీలించనుంది. కమిటీ విచారణ తర్వాతే హైకోర్టులో పిటిషన్కు అవకాశం ఉంది.
కాగా రాజాసింగ్ అడ్వకేట్ కరుణసాగర్ మీడియాతో మాట్లాడుతూ… అడ్వైజరీ బోర్డు రిపోర్ట్ వ్యతిరేకంగా వస్తే.. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.