సీనియర్ పత్రికా సంపాదకులు కే రామచంద్రమూర్తి కమిటీ సిఫార్సులను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు జారీ చేస్తున్నామని అక్రెడిటేషన్ల కమిటీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. ఆల్ జర్నలిస్ట్స్ అని అన్న రామచంద్రమూర్తి కమిటీ సిఫారసులను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో రిజిస్టర్ అయిన టీయూడబ్ల్యూజే, టీఎస్డబ్ల్యూజే, టీఎస్ యూడబ్ల్యూజే ప్రతినిధులు, ఇతర సభ్యుల అమోదంతోనే జారీ చేస్తున్నామని తెలిపారు.
తొలిసారి అత్యంత పారదర్శకంగా జారీచేస్తున్న అక్రెడిటేషన్లపై అపోహలు సృష్టించడం తగదని అల్లం నారాయణ కోరారు. డెస్క్, స్కానర్లు, ఆర్టిస్ట్ వంటి వారికి అక్రెడిటేషన్లు ఇవ్వడానికి కమిటీకి అభ్యంతరం లేదన్నారు. మార్గదర్శకాల మేరకే జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు జారీ చేస్తున్నట్లు టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షుడు పల్లె రవి ఒక ప్రకటనలో తెలిపారు.