ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాలం పార్లమెంటు సమావేశాలలో అడ్డంకులు ఎదురవకుండా సభ సజావుగా జరగాలనే ఉద్దేశంతో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్ని పార్టీల నేతలతో గురువారం సమావేశం నిర్వహించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ సభలో ప్లకార్డులను ప్రదర్శించవద్దని, చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నందున సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో తెలంగాణ ప్రజలు ఎలా పోరాట స్ఫూర్తితో వ్యవహరించారో అదేవిధంగా ఇప్పుడు హైకోర్టు విభజన అంశంలోనూ అదే తరహా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు.
హైకోర్టు విభజనపై ప్రధాని మోడీ సభలో స్పష్టమైన ప్రకటన చేసేంతవరకు ఆందోళన తప్పదని, ఇది తప్ప తమకు వేరే దారి లేదని స్పీకర్ కు చెప్పారు. హైకోర్టు విభజన డిమాండ్ తో ఆందోళన చేస్తున్నప్పుడు దానిపై స్పష్టత రాకపోతే ఎట్లా ఆపివేస్తామని ప్రశ్నించారు. నిరసనల ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఇప్పుడు కూడా నిరసనల ద్వారానే రాష్ట్రానికి హైకోర్టు ఏర్పడుతుందని, ఈ పరిస్థితి కల్పించింది కేంద్రమేనని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.