mt_logo

కన్నంలో దొరికిన దొంగ!

-సేకరించిన విరాళాలపై మాటమార్చిన రాధాకృష్ణ
-వీణావాణీల కుటుంబానికి చేయూతకోసమని నాడు ఉద్ఘాటన
-ఆ చిన్నారుల సర్జరీ ఖర్చుకోసమేనని ఇప్పుడు నాలిక మడత
-అడ్డంగా బుక్కయ్యేసరికి పనికిమాలిన వాదనలు

బోనులో చిక్కిన ఎలుక పడే పాట్లెలా ఉంటాయి? కన్నంలో దొరికిపోయిన దొంగ ఆపసోపాలెలా ఉంటాయి? సరిగ్గా ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణలాగ!! అందుకే తన బ్రాండ్ అబద్ధాల కలంలో విష అక్షరాలు నింపుకుని తన పత్రికలో పచ్చిగా పిచ్చిరాతలు రాసుకున్నాడు! వీణావాణీల పేరిట సేకరించిన విరాళాలను బాధిత కుటుంబానికి ఇవ్వకుండా మూడేండ్లకుపైగా తన దగ్గరే అట్టిపెట్టుకుని, దాన్ని నమస్తే తెలంగాణ ప్రశ్నించడాన్ని నేరంగా అక్షరీకరిస్తున్నాడు! పిచ్చిరాతలు రాసేవారికి అన్నీ పిచ్చిగానే కన్పిస్తాయి! తప్పులు చేసేవారికి ఎదుటివాళ్లలో కూడా తప్పులే కనిపిస్తాయి! అవునుమరి! పచ్చకామెర్ల సామెత ఉండనే ఉందిగా! బహుశా తెలుగు వాక్యాల్లో రాధాకృష్ణకు నచ్చని ఏకైక వాక్యం నన్ను ప్రశ్నించడం కాబోలు! అందుకే వీణావాణీల పేరిట వసూలుచేసి కాజేసిన విరాళాల విషయంలో ఆంధ్రజ్యోతి ఇప్పుడు చేస్తున్న పని.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే!!

వీణావాణీల కుటుంబానికి సహకారం పేరుతో 2012 జనవరిలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో ఈ విరాళాలు ఎందుకు సేకరిస్తున్నారన్న విషయంలో యాంకర్ మూర్తి పదేపదే దాతలకు వివరణ ఇచ్చారు. వీణావాణీల తల్లిదండ్రులకు మరో ఇద్దరు పిల్లలున్నారని, వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, వారికి సాయం చేయడంకోసమే ఫండ్ రైజ్ చేస్తున్నామని ఒకటికి పాతికసార్లు స్పష్టతనిచ్చారు. ఈ విరాళాల సేకరణ వీణావాణీల ఆపరేషన్‌కోసం కాదు.. ఆపరేషన్ ఖర్చు ప్రభుత్వం చూసుకుంటుంది.. కష్టాల్లో ఉన్న తల్లిదండ్రులకు ఆర్థికసాయం కోసమే అని తెలిపారు. ఒకరిద్దరు దాతలు ఎందుకోసం విరాళాలు సేకరిస్తున్నారని అడిగినప్పుడు కూడా ఆపరేషన్ కోసం కాదంటూ నొక్కిచెప్పాడు. మరి.. మూ డేండ్లు దాటుతున్నా ఆ సొమ్ములోంచి పైసా కూడా వీణావాణీల తల్లిదండ్రులకు ఇవ్వకపోవడాన్ని కాజేయడం అనడం కాక మరేమనాలి! ఇన్నేండ్లలో ఒక్కసారి కూడా ఆ కుటుంబాన్ని, ఆ చిన్నారులను పలకరించకపోవడాన్ని ఏ పేరుతో పిలవాలి? మీ పాపల పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ఇంత మంది ఇంత డబ్బు విరాళంగా ఇచ్చారని ఒక్క ముక్కైనా చెప్పకపోవడాన్ని ఏ కోణంలో చూడాలి? నమస్తే తెలంగాణ సరైన కోణంలోనే చూ సింది. బాధిత కుటుంబం ఆవేదనకు అక్షర సాయం చేసింది!

మూడేండ్లలో మాటలు రివర్స్..
వ్యవహారం కాస్తా బయటపడిపోవడంతో ఇప్పుడు అడ్డంగా అబద్ధాలు ముద్దరేస్తున్నది ఆంధ్రజ్యోతి. ఆదివారంనాటి సంచికలో నమస్తే తెలంగాణపై నోరు పారేసుకోవడమే అందుకు ఉదాహరణ. కష్టాల్లో ఉన్న తల్లిదండ్రుల కోసమేనంటూ పలికిందే పలికిన మాటలు.. మూడేండ్లలో రివర్సయిపోయాయి. అబ్బే.. ఆ సొమ్ము తల్లిదండ్రులకు ఇవ్వడానికి కాదు.. సర్జరీ కోసమే.. అని అడ్డంగా మాట మార్చేస్తూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి అసత్యాలకు పరాకాష్ఠ ఉండదని నిరూపించారు. అందుకే వాస్తవాలు వాళ్లకు పిచ్చి పతాక కథనాలుగానే కనిపిస్తాయి! చేసిన నికృష్టపు పనులను ప్రశ్నించడం అంతకంటే నికృష్టంగా అనిపిస్తుంది! ఇంకేముంది? ముందూ వెనుకా చూసుకోకుండా.. లైవ్ కార్యక్రమంలో ఏం చెప్పారో చూసుకునే ఓపికకూడా లేకుండా తెడ్డెమన్నారు. అసలు విరాళాలు సేకరించింది సర్జరీకోసమేనని, తల్లిదండ్రులకు ఇవ్వటానికి కాదని కొత్త పలుకు పలికారు. పైగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఇన్ని కోట్లిచ్చాం.. అన్ని కోట్లిచ్చాం అని ఫొటోలు వేసుకుని మరీ గప్పాలుకొట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం అప్పటికి ఊసులో లేని సంగతి. కానీ.. వీణావాణీల తల్లిదండ్రుల పరిస్థితి అలాంటిది కాదు. ఈ పూట ఎలా గడుస్తుందో.. రేపటి సంగతి ఏంటో తెలియక సాగే నిరుపేద జీవితం. నాలుగు రూపాయలు వాళ్లకు భరోసా. కష్టాల మధ్య చిన్నపాటి ఆశ. కానీ.. సచివాలయంలో చెక్కులిచ్చి ఫొటో తీయించుకుంటే వచ్చే లాభంతో పోల్చితే ఒక పేద ఇంటికి వెళ్లడం తక్కువనుకున్నారేమో వాళ్ల సంగతే పక్కనపడేశారు రాధాకృష్ణ. ఆపరేషన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు ఆంధ్రజ్యోతి రాసుకుంది. నిజంగానే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం సమంజసమేనా? ప్రత్యేక లెడ్జర్ ఖాతాలో డబ్బును దాచినట్లు చూపిస్తున్న ఆంధ్రజ్యోతి కనీసం దానిపై వచ్చిన వడ్డీనైనా అత్యంత పేదరికంలో ఉన్న వీణావాణీల తల్లిదండ్రులకు ఎందుకు ఇవ్వలేదు? లేదంటే.. వైద్య పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందిన తరువాత.. తక్కువ ఖర్చుతో.. ఆంధ్రజ్యోతి ద్వారానే వసూలుచేసిన డబ్బుతో.. ఆపరేషన్ చేయిద్దామని ఆగారా? ఆంధ్రజ్యోతి ఎండీకి-వీణావాణీ తండ్రి మురళీగౌడ్‌కు మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నారు. కానీ మురళీగౌడ్ ఒక ఐదువేల కోసం రాధాకృష్ణపై ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది?

ఇది మా బాధ కాదు.. బాధితుల ఆవేదన
కానీ.. ఇదేదో ప్రతీకారాత్మక కథనం అనేది రాధాకృష్ణ కనిపెట్టిన అతీంద్రియ రహస్యం! నిజానికి ఇది నమస్తే తెలంగాణ బాధ కాదు. దవాఖానలో అవిభాజ్య కవలలుగా నరకయాతన పడుతున్న చిన్నారులు.. ఇంట్లో కనీసావసరాలు తీర్చాల్సిన మరో ఇద్దరు పిల్లలు.. చాలీచాలని సంపాదనతో సంసారం ఈడ్చేందుకు నానా అవస్థలు పడుతున్న ఒక సగటు మనిషి వేదన! తన పిల్లల బాధను చూపించి సేకరించిన విరాళాల్లో పైసా కూడా తమకు ఇవ్వలేదంటూ తనకు తెలిసిన మనిషి దగ్గర ఓ తండ్రి చెప్పుకొన్న ఆవేదన! ఆ బాధ నమస్తే తెలంగాణ దృష్టికివచ్చిన ఫలితంగానే ఏబీఎన్ చానల్ గతంలో ఈ పిల్లల పేరుతో విరాళాలు సేకరించి దాచుకున్న సొమ్ము సంగతిపై నిలదీసింది. దీనికి సమాధానం ఇవ్వని ఆంధ్రజ్యోతి.. నమస్తే తెలంగాణ బయటపెట్టిన స్వాహా సంగతిని కప్పిపుచ్చేందుకు దిగజారుడు పద్ధతుల్లో రొచ్చు కపిత్వాన్ని పేపర్లో నింపింది. బుకాయింపులకు దిగింది. నీచమైన పనిని నిలదీయడాన్ని నీచమైన జర్నలిజంగా అభివర్ణిస్తూ కనీస పాత్రికేయ ప్రమాణాలకు తిలోదకాలిచ్చింది ఆంధ్రజ్యోతి. పైగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు కేసీఆర్ కుమార్తె వ్యక్తిగతంగా సాయం చేయడం లేదని, విదేశాలనుంచి విరాళాలు సేకరిస్తున్నారని మరో పనికిమాలిన ఆరోపణ. కవిత సారథ్యంలోని తెలంగాణ జాగృతి తనకు వచ్చిన విరాళాలను రైతు కుటుంబాలకు అందజేస్తున్నది. మరి వీణావాణీల పేరుతో వసూలు చేసిన సొమ్మును ఏబీఎన్ ఎందుకు ఆ చిన్నారుల తల్లిదండ్రులకు ఇవ్వటంలేదు? ఆంధ్రజ్యోతిని ఏదో చేయడానికి అప్పటి సీఎంవైఎస్ ఏదో చేయాలని చూసి ఏమీ చేయలేకపోయారని తాజా కథనంలో జబ్బలు చరుచుకున్నారు. అసలు సంగతి వదిలేసి కొసరు సవాళ్లెందుకు? నిజానికి ఆంధ్రజ్యోతి కనికట్టులను వరుస కథనాల్లో నమస్తే తెలంగాణ రాస్తే రామాయణమంత అవుతుంది.. చదివెటోళ్లకు మహాభారతం అంత ఉంటుంది.

నాలిక ఇలా మడతేశారు..
ఆ రోజు లైవ్ కార్యక్రమంలో ఏం చెప్పారో.. ఈరోజు పత్రికలో ఏం రాశారో చూస్తే చాలు ఏబీఎన్ పచ్చి అబద్ధాలకోరని చెప్పడానికి. దాతలకు విరాళాలపై ఆహ్వానం పలికినప్పుడేమన్నారో ఆనాటి వీడియో ఇంటర్‌నెట్‌లో ఇప్పటికీ భద్రంగానే ఉంది. ఆ కార్యక్రమంలో యాంకర్ మూర్తి మాటలు ఇలా ఉన్నాయి.. సర్జరీకోసం కాదు.. సర్జరీ ఖర్చు ప్రభుత్వం భరిస్తానంటున్నది. మీరు నిలదొక్కుకోవడానికి ఇక్కడ ఉండి పిల్లలను చూసుకోవడానికి అవసరమైన వసతి, ఆ పిల్లలిద్దరికీ విద్యాసౌకర్యాలు కల్పిస్తామని ఒక స్వచ్ఛంద సంస్థనుంచి పద్మనాభశర్మగారు కూడా ముందుకు వచ్చారు. అవన్నీ మీకు అందజేస్తాం! కానీ.. ఆదివారంనాటి ఆంధ్రజ్యోతిలో ఎంత నీచంగా అబద్ధాలు రాశారో చూడండి.. తలలు కలిసిపోయి పుట్టిన వీణా-వాణిలను శస్త్రచికిత్స ద్వారా విడదీసి, వారికి కొత్త జీవితం ఇవ్వాలనే సదుద్దేశంతో 2012 జనవరిలో ఏబీఎన్ చానల్ ఓ కార్యక్రమం నిర్వహించింది. వారి శస్త్రచికిత్స ఖర్చులో కొంతైనా సమీకరించే లక్ష్యంతో దాతలనుంచి విరాళాలు సేకరించింది!! అవిభాజ్య కవలలైన వీణావాణీల తండ్రిని ఏబీఎన్ మోసం చేసిందనటానికి, మూడేండ్ల తర్వాత మాట మార్చేసిందనటానికి ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదు! ఇస్తామన్న సొమ్మును బాధితులు అడిగినా పైసా కూడా ఎందుకు ఇవ్వలేదు? దీనిపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు? మాట నిలబడే ఉంటుంది.. తస్మాత్ జాగ్రత్త!

పత్రికల్లో ముద్రించే కథనాలు ఏండ్లతరబడి ఉంటాయి! కాగితం మీద రికార్డయి ఉంటాయి! ఈ జాగ్రత్త కూడా పాటించని ఆంధ్రజ్యోతి.. ఆనాటి లైవ్‌లో చెప్పిన మాటలను గాలికివదిలేసి.. ఇప్పుడు సర్జరీకోసమే విరాళాలు సేకరించామని నిస్సిగ్గుగా రాసేసుకుంది! ఈ నాలిక మడత చాలు నమస్తే తెలంగాణ రాసిన కథనం అక్షరసత్యమని నిరూపించడానికి! సర్జరీకి రూ.8కోట్ల వ్యయం అవుతుందని డాక్టర్లు చెప్పినట్లు వీణావాణీల తల్లిదండ్రులు ఆ కార్యక్రమంలో తమ గోస చెప్పుకున్నారు. అదే కార్యక్రమంలో నాటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇంటర్వ్యూ కూడా ప్రసారంచేశారు. ప్రభుత్వం ఎంత మొత్తమైనా సరే భరించి వారికి ఆపరేషన్ చేయించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ సమయంలో యాంకర్ స్పందిస్తూ ప్రభుత్వమే వీణా-వాణీల అపరేషన్‌కు అయ్యే ఖర్చును భరిస్తానంటున్నది కనుక కనీసం బిడ్డలను వచ్చి చూసుకునేందుకు కూడా ఆర్థిక స్థోమత లేని వీణావాణీల తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అంటూ మానవత్వాన్ని ఒకలబోశాడు. ఆ మానవత్వాన్ని చెత్తబుట్టలో పడేసి.. ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా పత్రికల్లో కథనాలు వార్చారు. పైగా సమయం వచ్చినప్పుడు ఆ సొమ్ము పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తామంటూ జనం చెవిలో పువ్వులు పెట్టేందుకు ప్రయత్నించారు.

నాటి లైవ్ కార్యక్రమంలో స్పందించిన దాతలు.. అందుకు యాంకర్ వక్కాణింపులు ఇలా ఉన్నాయి..
పూర్ణచంద్రరావు (ఖమ్మం): మీ పాపల కోసం ప్రేయర్ చేస్తున్నం. మీరేమీ భయపడొద్దు. మీ అకౌంట్‌లో వెయ్యి వేయాలనుకుంటున్నా.

గోపీచంద్: వారికి మేం కూడా హెల్ప్ చేస్తున్నాం.

యాంకర్: మేం ఆ డబ్బును వారి తల్లిదండ్రులకు అందజేస్తాం. పిల్లలను ఆస్పత్రిలో ఉంచే పరిస్థితి లేదు. పిల్లలు ఆస్పత్రిలో ఎదుగుతున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల తల్లిదండ్రులు పెంచలేని పరిస్థితిలో ఉన్నారు. ఆస్పత్రి వారు పొమ్మంటున్న పరిస్థితి. సమాజంలో మనందరికీ బాధ్యత ఉంది. మనం ఆపరేషన్ చేయలేం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఒక ఫండ్‌ను క్రియేట్ చేస్తుంది. మీరందరూ హెల్ప్ చేయండి. అవసరమైన ఖర్చులకోసం, వారి తల్లిదండ్రులకోసం ఇద్దాం.(ఈ సమయంలో వీణ-వాణీ తండ్రిమురళీగౌడ్ కన్నీంటి పర్యంతమయ్యారు)

అంజనీ: టీవీలో చూస్తున్నాం బాధాకరమైన పరిస్థితి. ఈ హెల్ప్ పిల్లల ఆపరేషన్ కోసమా? తల్లిదండ్రులకు సపోర్ట్ కోసమా?

యాంకర్: పిల్లల ఆపరేషన్‌కోసం కాదండీ. తల్లిదండ్రుల సపోర్ట్‌కోసం. ఆపరేషన్‌కోసం ప్రభుత్వం రెస్పాన్స్‌బులిటీ తీసుకుంటాం అంటున్నది.

మాధవ్ (కరీంనగర్): మేం సాయం చేయాలనుకుంటున్నాం. ఎన్ని రోజుల్లో ఇవ్వొచ్చండి…?

యాంకర్: అలా టైం ఏమీ లేదు. ఒక ఫండ్ రైజ్ చేస్తున్నాం వారి తల్లిదండ్రులకు ఇవ్వడానికి. ఆ పిల్లలకు సంబంధించిన అవసరాలు తీర్చడమే మన ఉద్దేశం. సమయం ఏమీ లేదు. వీలున్నప్పుడు చేయండి.

విద్య (హైదరాబాద్): ఆ పాపలు మన అందరి పాపలు. డాక్టర్లు వారికి ఆపరేషన్ చేయాలి. ఏ రకంగానైనా వారు విడిపోవాలి. పాపలకు ఏం కాదు. పిల్లలకు కావాల్సింది అమౌంట్ కాదు. అది ఎవరైనా చేయగలరు.

ఆపరేషన్ కావాలి…
యాంకర్: ముఖ్యమంత్రి రోశయ్యగారితో కూడా మాట్లాడాం. పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. నిలోఫర్ ఆస్పత్రిలో తల్లిదండ్రుల కంటే బాగా చూసుకుంటున్నారు. ప్రాబ్లంమేంటంటే.. వయస్సు పెరుగుతున్న కొద్ది పిల్లలకు వేరేవేరే సమస్యలు వస్తాయి. తల్లిదండ్రులు తీసుకెళ్తారా.. అంటే ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇంకో ఇద్దరిని సాకలేని ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్నారు కాబట్టి ఆ కోణంలోనే ఈ పని చేస్తున్నాం.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *