mt_logo

ఆ చెరువు నిండింది .. నా ఊరు పండింది

ప్రజా యుద్ధనౌక గద్దర్ ‘కొత్త పాట’
చెరువుల నిర్మాణంతో ప్రగతి బాట
తెలంగాణ పునర్నిర్మాణానికి ఆదర్శంగా తూప్రాన్
జన్మభూమికి సాగునీటి కోసం గద్దర్ కృషి
రూ.3.51 కోట్లతో మొదలైన పనులు
ఖరీఫ్ నుంచి 684 ఎకరాలకు సాగునీరు
1204 మంది రైతులకు లబ్ధి

పంట పండాలంటే చేను తడవాలి. చేను తడవాలంటే నీళ్లు కావాలి. మరి… నీళ్లెక్కడున్నాయ్? ఉన్నాయ్! తెలంగాణలో నదులున్నాయి, ఆ నదుల్లో నీళ్లున్నాయ్. కానీ… తెలంగాణ ఒక ప్రత్యేక భౌగోళిక నిర్మాణం. పైన నేల ఉంటుంది. నీళ్లు కింద ఎక్కడో పారుతుంటాయి. ‘పల్లం మాత్రమే ఎరిగిన నీరు’ పైకి ఎక్కి రావాలంటే, పొలంలోకి పారాలంటే కాల్వలు సరిపోవు. ఎత్తిపోతలే దిక్కు. ఈ విషయాన్ని నాడు రాజ్యాలేలిన రాజులు గుర్తించారు. ఊరూరా చెరువులు తవ్వించారు. వాటిని గొలుసుకట్టుగా అనుసంధానించారు. రాజులు పోయారు. రాజ్యాలూ పోయాయి. వాటితోపాటు.. చెరువులూ పోయాయి. నేడు నీరు పారనంటోంది. పొలం తడవనంటోంది! తెలంగాణ సాగు బాగుపడేందుకు అత్యవసరం… చెరువుల పునర్నిర్మాణం! ప్రజా గాయకుడు గద్దర్… రాజకీయాలకు అతీతంగా ఆ పని మొదలుపెట్టారు. అదెలాగో చూడండి…

‘గుర్తున్న నా బిడ్డ.. కన్న వూరు కడుపు దేవిందా! ఎన్నేండ్లకొచ్చావు బిడ్డా’ -తాను పుట్టిన తూప్రాన్‌ను ఉద్దేశించి గద్దర్ రాసిన పాట ఇది! గ్రామంలో కులాలు, చెరువులు, చేతివృత్తులు, భూమి, నీరు.. తన ఊర్లో ఏ మార్పులు రావాలని కోరుకున్నారో అక్షరాల్లో స్వప్నించారు. ఆ మార్పులు రాకపోవడాన్ని చూసి అవే అక్షరాల్లో ఆవేదన చెందారు. పాటలు రాయడంతో.. ఆ పాటలు పాడడంతోనే ఆగిపోలేదు గద్దర్! తన ఊరు బాగుకు స్వయంగా నడుం కట్టారు! తన ఊరి రైతులకు సాగునీరు అందించేందుకు సంక్షేమ బాట పట్టారు! తెలంగాణ పునర్నిర్మాణానికి తన ఊరు తూప్రాన్‌ను ఆదర్శంగా నిలిపేందుకు సిద్ధమయ్యారు! మెదక్ జిల్లా తూప్రాన్ గద్దర్ సొంత గడ్డ. ఈ ఊర్లో మ్యాడక్ చెరువు, పెద్ద చెరువు ఉన్నాయి. మ్యాడక్ చెరువు కింద 259 మంది రైతులకు చెందిన 153 ఎకరాలు, పెద్ద చెరువు కింద 945 మంది రైతులకు చెందిన 531 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒకప్పుడు రెండు చెరువులకింద ఉన్న భూములతో పొలాలు పచ్చబడేవి. కానీ… తర్వాత పరిస్థితి మారిపోయింది. పెద్ద చెరువు అప్పుడెప్పుడో 27 ఏళ్ల కిందట అంటే.. 1986లో నిండింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడూ నిండలేదు. అప్పటి నుంచే ఆయకట్టు భూములు సాగుకు నోచుకోలేదు. దాంతో రైతులు వ్యవసాయాన్నే వదిలి పెట్టారు. కొందరు భూములు పడావు పెట్టారు.

మరికొందరు రియల్టర్లకు అమ్ముకున్నారు. రైతుల బతుకులు ఆగమాగమయ్యాయి. ఇన్నేళ్లలోనూ పాలకులు వారి గురించి పట్టించుకోలేదు. ఇటీవలే గద్దర్ తూప్రాన్ వచ్చారు. ఊరంతా తిరిగి ప్రజలను కలుసుకున్నారు. రైతుల దయనీయ స్థితికి కళ్లు చెమర్చిన గద్దర్.. సాగునీరు అందించేందుకు.. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించేందుకు ఒక ఉద్యమమే చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పలువురు మంత్రులు, అధికారుల వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించారు. తూప్రాన్ శివారులోని కిష్టాపూర్ రోడ్డులోని హల్దీవాగు నుంచి వృథాగా పోతున్న 11.80 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతల ద్వారా మ్యాడక్ చెరువు, పెద్ద చెరువుకు మళ్లించేందుకు బృహత్ ప్రణాళిక రూపొందించారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించి రూ.3.51 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో హల్దీవాగు చెక్‌డ్యాం వద్ద బావి నిర్మాణంతోపాటు పైపులైన్ పనులు సాగుతున్నాయి. ఇక్కడి నుంచి 550 మీటర్ల దూరంలో మరో బావిని నిర్మించాల్సి ఉంది. చెక్‌డ్యాం వద్ద ఉన్న బావి నుంచి ఎత్తిపోతల ద్వారా ఈ బావిలోకి నీటిని పంపిస్తారు. ఇక్కడి నుంచి నీళ్లు పైపులైన్ల ద్వారా గ్రావిటీతో మ్యాడక్ చెరువు నిండి పెద్ద చెరువులోకి వెళతాయి. ఎత్తిపోతల కోసం తూప్రాన్ సబ్ స్టేషన్ నుంచి ప్రత్యేక లైన్ వేసి, 200 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ అమరుస్తారు. యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న ఈ పనులన్నీ నాలుగైదు నెలల్లో పూర్తయి, వర్షాకాలంలో వర్షపు నీటిని వినియోగించుకుని, ఖరీఫ్ సీజన్‌లో 1204 మంది రైతులకు సాగు చేసుకునే అవకాశం కలుగుతుంది.

చెరువు నిండితే ఊరుకు పండగ: గద్దర్

చెరువు నిండితేనే ఊరంతటికీ పండుగ అవుతుందని గద్దర్ తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ.. “ఊరంటే భూమి, నీరు, నాగిటెడ్లు, కులవృత్తులు. ఊరి చెరువు నిండితే పంటలు పండి, కులవృత్తులు వెలుగుతాయి. అందుకే సాగునీటిని అందించేందుకు దృష్టిసారించాను. తెలంగాణ రాగానే అద్భుతాలు ఏమీ జరగవు. తెలంగాణ వచ్చాక జరిగే పునర్నిర్మాణానికి సందేశం ఇచ్చేందుకే తూప్రాన్‌లో చిన్న ప్రయోగం చేపట్టాను. ఇందుకు సహకరించిన అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు” అని గద్దర్ తెలిపారు. ఒక్క ఇంచు బీడు భూమి ఉండరాదని, ఒక్క చుక్క నీరు వృథా పోరాదన్న లక్ష్యంతో ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టానన్నారు. అలాగే, సామాజిక బాధ్యతగా మద్యపానం, ధూమపానం, వ్యభిచారానికి దూరంగా ఉంటామని, నీటి చుక్కను వృథా పోనీయమని తూప్రాన్ మండలంలోని గ్రామాలన్నీ తిరిగి ప్రతిజ్ఞ చేయిస్తున్నానని చెప్పారు.

Courtesy: Andhra Jyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *